Satyendra Jain: తీహార్ జైల్లో ఆప్ మంత్రికి మసాజ్... ఈడీకి నోటీసులు పంపిన ఢిల్లీ కోర్టు

Delhi Court issues notice to ED over Satyendra Jain leaked video
  • ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
  • మే 30న అరెస్ట్.. దర్యాప్తు జరుపుతున్న ఈడీ
  • మసాజ్ వీడియో విడుదల చేసిన బీజేపీ
  • కోర్టును ఆశ్రయించిన సత్యేంద్ర జైన్ న్యాయవాదులు
ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్ (58) మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అయితే, సత్యేంద్ర జైన్ కు తీహార్ జైల్లో రాజభోగాలు అందుతున్నాయని బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన వీడియో తీవ్ర కలకలం సృష్టించింది. 

మంత్రి సత్యేంద్ర జైన్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. దాంతో మంత్రి సత్యేంద్ర జైన్ న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ సీసీటీవీ పుటేజి లీక్ కావడానికి ఈడీనే కారణమని వారు ఆరోపించారు. కోర్టుకు ఇచ్చిన మాటను బేఖాతరు చేస్తూ ఈడీనే ఈ వీడియోను లీక్ చేసిందని తెలిపారు. 

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఈడీ పర్యవేక్షిస్తున్నప్పుడు వీడియో ఎలా లీకైందని స్పెషల్ జడ్జి వికాస్ ధూల్ సదరు దర్యాప్తు సంస్థను ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. 

అటు, బీజేపీ విడుదల చేసిన వీడియో పాతదని తీహార్ జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆ ఘటనకు సంబంధించి బాధ్యులపై జైలు ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకున్నట్టు వెల్లడించాయి. మనీలాండరింగ్ ఆరోపణలపై సత్యేంద్ర జైన్ ను ఈడీ మే 30న అరెస్ట్ చేసింది.
Satyendra Jain
Massage
Video
ED
Court
Notice
Delhi

More Telugu News