Kanika Reddy: మా విమానాల్లో ఎప్పుడూ డబ్బు, మద్యం తరలించలేదు: కనికారెడ్డి

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో జెట్ సెట్ గో సంస్థపై ఆరోపణలు
  • సంస్థకు చెందిన విమానాల్లో డబ్బు తరలించినట్టు అనుమానం
  • జెట్ సెట్ గో సీఈవో కనికా రెడ్డికి ఈడీ నోటీసులు
  • నేడు విచారణకు హాజరైన కనికా రెడ్డి
Kanika Reddy statement on allegations in related to Delhi Liquor Scam

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కాగా, ఆయన భార్య జెట్ సెట్ గో విమానయాన సంస్థ ఎండీ కనికా రెడ్డిని కూడా ఈడీ అధికారులు నేడు విచారించారు. కనికా రెడ్డి ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ముడుపులను జెట్ సెట్ గో విమానాల్లో తరలించారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు కనికా రెడ్డిని ప్రశ్నించారు. 

తమపై ఆరోపణలు వస్తుండడం పట్ల కనికా రెడ్డి నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. తమ విమానాల్లో ఎప్పుడూ డబ్బు, మద్యం తరలించలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంను తమ కంపెనీ విమానాలకు ముడిపెడుతూ నిరాధార కథనాలు తీసుకువస్తున్నారని, దీన్ని తాను గట్టిగా ఖండిస్తున్నానని తెలిపారు. తన భర్త శరత్ చంద్రారెడ్డి అమాయకుడని, ఈ వ్యవహారంలో అతడి పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని కనికా రెడ్డి వెల్లడించారు. 

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో నగదు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి తరలినట్టు భావిస్తున్నారు. అందుకు జెట్ సెట్ గో విమానాలను ఉపయోగించారని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో జెట్ సెట్ గో విమాన ప్రయాణికుల వివరాలు, వారు తీసుకెళ్లిన వస్తువుల వివరాలు కోరుతూ ఈడీ ఇటీవల ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి లేఖ రాసింది.

More Telugu News