Dates: డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తింటే ఏమవుతుంది?

  • పరిమితంగా తింటే ఏమీ కాదు
  • 2-3 ఖర్జూరాలను తీసుకోవచ్చు
  • బాదం, వాల్ నట్ తో కలిపి తింటే ఇంకా మంచిది
  • మంచి పోషకాలు లభిస్తాయి
Does Dates Increase Blood Sugar Lets Find Out

ఖర్జూరం పోషకాల నిలయం. రక్తహీనత ఉన్న వారికి మంచి ఆహారం. కాకపోతే ఇందులో తీపిదనం ఎక్కువ. దీంతో మధుమేహం ఉన్న వారు తినొచ్చా? అన్న సందేహం వస్తుంటుంది. అసలు రక్తంలో గ్లూకోజ్ ను ఖర్జూరం పెంచుతుందా? 

ఖర్జూరం తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. కానీ, స్వల్ప స్థాయిలోనే అని తెలుసుకోవాలి. ఇందులో ఐరన్, క్యాల్షియం, బీ విటమిన్లు, మెగ్నీషియం, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అదే సమయంలో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువే. ప్రతి 100 గ్రాముల డేట్స్ లో 75 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే దీన్ని తినాలంటే డయాబెటిస్ ఉన్న వారు సంకోచిస్తుంటారు. 

కాకపోతే డేట్స్ లో సాల్యుబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. కనుక కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నప్పటికీ, తిన్న వెంటనే ఒకేసారి రక్తంలోకి చేరవు. పీచు వల్ల నిదానంగా జీర్ణమవుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగిపోదు. రక్తంలో బ్లడ్ షుగర్ తక్కువగా ఉండి బాధపడేవారికి (హైపో గ్లైసీమియా) ఖర్జూరం మంచి ఆహారం అవుతుంది.

రోజులో రెండు నుంచి మూడు ఖర్జూరాలు తినొచ్చు. ఖర్జూరం ఒక్కటే కాకుండా, దీనికి బాదం, వాల్ నట్ కలిపి తినడం ఇంకా మంచి ఆప్షన్ అవుతుంది. ఖర్జూరం గ్లైసిమిక్ ఇండెక్స్ 44-53 మధ్య (రకాన్ని బట్టి) ఉంటుంది. గ్లైసిమిక్ లోడ్ 18. కనుక ఇది తక్కువ కాదు, ఎక్కువ కాదు.. మధ్యస్థం. గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది తిన్న ఆహారం నుంచి ఎంత వేగంగా కార్బోహైడ్రేట్లు రక్తంలో కలుస్తాయన్నది తెలియజేసే ప్రామాణికం.

More Telugu News