Hyderabad: గంటకు 240 కి.మీ వేగం.. నేడు, రేపు హైదరాబాద్​ జరిగే ఇండియన్ రేసింగ్ లీగ్ విశేషాలు ఇవి..!

First race of Indian Racing League in Hyderabad on Saturday and Sunday
  • బరిలో ఆరు జట్లు.. 24 మంది డ్రైవర్లు
  • దేశంలో మొదటి స్ట్రీట్ సర్క్యూట్ రేస్ గా ఘనత
  • ఇదే ట్రాక్ పై ఫిబ్రవరి 11న ఫార్ములా–ఇ రేస్ నిర్వహణ
మోటార్ రేసింగ్ స్పోర్ట్స్ కు చాలా మంది అభిమానులు ఉంటారు. విదేశాల్లోనే ఎక్కువగా జరిగే ఈ ఈవెంట్లను భారతీయులు టీవీల్లో చూస్తుంటారు. అలాంటి రేసులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం హైదరాబాద్ అభిమానులకు లభించనుంది. దేశంలో తొలిసారి లీగ్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ ఎల్) తొలి దశ పోటీలు శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతాయి. ఈ లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు, 24 మంది రేసర్లు పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ట్రాక్ పై 1100 సీసీ సామర్థ్యంతో కూడిన ఫార్ములా–3 లెవెల్ కార్లు 240 కి.మీ వేగం వరకు దూసుకెళ్లనున్నాయి. దేశంలో జరుగుతున్న మొదటి స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ఇదే కావడం విశేషం. 

ఐఆర్ ఎల్ నాలుగు రౌండ్లలో జరుగుతుంది.  మొదటి రౌండ్, చివరి రౌండ్ (డిసెంబర్ 11,12) హైదరాబాద్ కు కేటాయించారు. రెండు, మూడో రౌండ్లు చెన్నైలో నిర్వహిస్తారు. ఇక, ఫిబ్రవరి 11న ఇదే ట్రాక్ పై ప్రతిష్ఠాత్మక ఫార్ములా–ఇ రేస్ జరుగుతుంది. కాబట్టి ట్రాక్ టెస్టింగ్ కు ఐఆర్ఎల్ పోటీలు  ట్రయల్ లా ఉపయోగడతాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ రేసులను చూసేందుకు ఐమాక్స్ థియేటర్ పాటు ట్రాక్ పొడుగునా అభిమానుల కోసం వివిధ ప్రాంతాల్లో ఏడు వేల మంది కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.  టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ఒక్క రోజుకు రూ. 749,  రెండు రోజులకు రూ.1249 ప్రారంభ ధరలతో టికెట్లు బుక్ మైషోలో అందుబాటులో ఉంచారు. ఈ రేస్ స్టార్ స్పోర్ట్స్ లో  ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది.

శనివారం రేసింగ్‌ షెడ్యూల్‌: 
మధ్యాహ్నం: 3.10-3.20 వరకు క్వాలిఫయింగ్‌ 1 
మధ్యాహ్నం: 3.30-3.40 వరకు క్వాలిఫయింగ్‌ 2 
సాయంత్రం: 4.00-4.45 వరకు రేస్‌-1 
సాయంత్రం: 4.45-5.00 వరకు పోడియం
Hyderabad
indian racing league
first race
formulae race

More Telugu News