తొలిసారి కుమార్తెతో కలిసి కనిపించిన కిమ్ జోంగ్ ఉన్

19-11-2022 Sat 09:10
  • క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కుమార్తెను తీసుకొచ్చిన కిమ్
  •  వ్యక్తిగత జీవితాన్ని పూర్తి రహస్యంగా ఉంచే కిమ్
  • ఇటీవల ఆయన వైఖరిలో మార్పు
  • 2012 వరకు కిమ్-రి వివాహం కూడా రహస్యమే
Kim Jong Un seen with daughter in her 1st public appearance
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. తన ప్రైవేట్ లైఫ్‌ను గోప్యంగా ఉంచే కిమ్ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన ఆయన తాజాగా కుమార్తెతో కనిపించడం చర్చనీయాంశమైంది. కుమార్తెతో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తున్న కిమ్ ఫొటోలను అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రచురించింది. అయితే, కిమ్  కుమార్తె పేరును మాత్రం వెల్లడించలేదు. 

శుక్రవారం ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు. నిన్న ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఓ ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్ కొరియా ఈ నెలలో ప్రయోగించిన రెండో ప్రయోగం ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర తీరంలో పడింది.

నిజానికి కిమ్ వ్యక్తిగత జీవితం ఇప్పటికీ రహస్యమే. బాస్కెట్ బాల్ మాజీ స్టార్ డెనిస్ రోడ్మన్ 2013లో బ్రిటిష్ డైలీ ‘గార్డియన్’తో  మాట్లాడుతూ.. కిమ్‌కు ఓ కుమార్తె ఉందని, ఆమె పేరు ‘జు ఏ’ అని పేర్కొన్నారు. తాను ఆయన కుటుంబంతో గడిపానని చెప్పుకొచ్చారు. కిమ్‌ను మంచి తండ్రిగా అభివర్ణించిన ఆయన..  కిమ్ భార్య రి సోల్ జుతోనూ మాట్లాడానన్నారు. కాగా, జులై 2012 వరకు కిమ్-రి వివాహంపై ప్రభుత్వ మీడియా వెల్లడించలేదు. అప్పటికి మూడేళ్ల ముందే వీరి వివాహాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి.