'లవ్ టుడే' థియేటర్లను షేక్ చేస్తుంది: దిల్ రాజు

18-11-2022 Fri 22:03
  • కోలీవుడ్ లో ఈ నెల 4న విడుదలైన 'లవ్ టుడే'
  • వేగంగా 50 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా 
  • తెలుగులో విడుదల చేస్తున్న దిల్ రాజు 
  • ఈ నెల 25న థియేటర్లకు వస్తున్న సినిమా 
Love Today Movie Audio Launch Event
కోలీవుడ్ లో ఈ నెల 4వ తేదీన విడుదలైన 'లవ్ టుడే' సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకుడు .. హీరో కూడా. ఆయన జోడీగా 'ఇవాన' నటించిన ఈ సినిమాను, ఈ నెల 25వ తేదీన తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంటును నిర్వహించారు. వంశీ పైడిపల్లి -  అనిల్ రావిపూడి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. 

ఈ స్టేజ్ పై దిల్ రాజు మాట్లాడుతూ .. 'లవ్ టుడే' అంటే ప్రేమ అనేది ఈ రోజుల్లో ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. ఇప్పటికి తమిళనాడులో ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా అయిన 'కాంతార' గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. అదే విధంగా 'లవ్ టుడే' గురించి కూడా మాట్లాడుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

విడుదలకి ముందు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాను. కానీ రిలీజ్ తరువాత తెరపై హీరో చేసిన మేజిక్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో, డబ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాను. తెలుగులో 'ఎఫ్ 3' స్థాయిలో ఈ సినిమాను తమిళనాడులో ఆదరిస్తున్నారు. తెలుగునాట కూడా ఈ సినిమా థియేటర్లను షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.