Supreme Court: హెటెరోపై సీబీఐ కేసు కొట్టివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court denies to dismiss CBI case on Hetero
  • జగన్ అక్రమాస్తుల కేసులో హెటెరోపై సీఐబీ కేసు
  • గతంలో సీబీఐ కోర్టులో, తెలంగాణ హైకోర్టులో హెటెరోకు నిరాశ
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫార్మా సంస్థ
  • ఇది కొట్టివేయదగ్గ కేసు కాదన్న అత్యున్నత న్యాయస్థానం
జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ ఫార్మా కంపెనీ హెటెరోకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ కేసు నమోదు చేయడాన్ని హెటెరో సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే, నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... హెటెరోపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. హెటెరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 

వాదనల సందర్భంగా... హెటెరో గ్రూపు మొత్తాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం సరికాదని హెటెరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కంపెనీ సిబ్బందిపై కేసు పెట్టాలి కానీ, కంపెనీపై కాదని విన్నవించారు. అయితే ఈ వాదనలను సుప్రీం ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. హెటెరో సంస్థల పిటిషన్ ను తోసిపుచ్చింది. 

కాగా, సీబీఐ కేసును కొట్టివేయాలంటూ హెటెరో గతంలో సీబీఐ కోర్టును, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా నిరాశే మిగిలింది. దాంతో ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

హెటెరో పిటిషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జోసెఫ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా... హెటెరో సంస్థలపై నమోదైన కేసు కొట్టివేయదగ్గది కాదని జస్టిస్ జోసెఫ్ స్పష్టం చేశారు. సీబీఐ పకడ్బందీగా చార్జిషీటు నమోదు చేసిందని తెలిపారు.
Supreme Court
Hetero
CBI
Jagan
Andhra Pradesh

More Telugu News