రోహిత్ ను తప్పించి హార్దిక్ పాండ్యాకు టీ20 టీమ్ పగ్గాలు ఇవ్వాలంటున్న మాజీ కోచ్

18-11-2022 Fri 10:08
  • కొత్త కెప్టెన్ ఉంటేనే టీ20 ఫార్మాట్ లో మంచి ఫలితాలు వస్తాయంటున్న రవిశాస్త్రి
  • ఈ విషయంలో ఇంగ్లండ్ జట్టు ను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్య
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఆటగాడు అన్ని ఫార్మాట్లలో కొనసాగలేడన్న శాస్త్రి
Shastri tells India to pick new T20 captain follow England template
టీ20 ఫార్మాట్ లో విజయపథంలో ఎలా నడవాలో ఇంగ్లండ్ జట్టును చూసి టీమిండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఈ ఫార్మాట్‌లో భారత్‌ రాత మారాలంటే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించడమే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఇంగ్లండ్‌ జట్టును ఉదాహరణగా తీసుకోవాలని సూచించాడు. రోహిత్ శర్మను టీ20 సారథ్యం నుంచి తప్పించాలని పరోక్షంగా చెప్పాడు. యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే మంచిదన్నాడు. 

విరాట్ కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న 35 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే, అతని కెప్టెన్సీలో ఆడిన ఆసియా కప్ (టీ20 ఫార్మాట్), టీ20 ప్రపంచ కప్ లో భారత్ నిరాశ పరిచింది. యూఏఈలో జరిగిన ఆసియా కప్ లో భారత్ సూపర్ 4 దశలోనే నిష్ర్కమించింది. ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. జట్టు ఆటపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు అవసరాన్ని రవిశాస్త్రి నొక్కి చెప్పాడు.  

టీ20 ఫార్మాట్ కు మరో కెప్టెన్ ను నియమిస్తే మంచిదని, దీని వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగబోదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డాడు. అందువల్ల రోహిత్‌ ను వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లకు సారథిగా కొనసాగించి  టీ20లకు కొత్త కెప్టెన్‌ను నియమించాలని సూచించాడు. హార్దిక్‌ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పగిస్తే మరీ మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రస్తుతం భారత్.. న్యూజిలాండ్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లో పోటీ పడనుంది. ఈ పర్యటనకు  రోహిత్‌, విరాట్‌, కేఎల్‌ రాహుల్‌, షమీకి విశ్రాంతి నిచ్చారు. దాంతో టీ20లకు హార్దిక్‌ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. వన్డేలకు శిఖర్‌ ధవన్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.