అలాంటి వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి ఒకరు: బాలకృష్ణ

17-11-2022 Thu 22:15
  • బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • లేటెస్ట్ ఎపిసోడ్ కు కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి, రాధిక
  • నవ్వులు పూయించిన బాలయ్య
  • కిరణ్, సురేశ్ లతో కాలేజీ ముచ్చట్లు
  • రాధికతో ఛలోక్తులు.. సందడి చేస్తున్న ప్రోమో
Balakrishna Unstoppable latest episode promo
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో కొత్త ఎపిసోడ్ కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ లేటెస్ట్ గా విడుదల చేసింది. 

ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల బాలయ్య కుటుంబాన్ని చూశారు, ఇప్పుడు బాలయ్య స్నేహాన్ని చూస్తారు అని వెల్లడించారు. అనడమే కాదు, తన కాలేజీ స్నేహితులైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలను ఆహ్వానించి, వారితో అనేక సంగతులు కలబోసుకున్నారు. కాలేజీ ముచ్చట్లను తనదైన శైలిలో అతిథులిద్దరి నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బతికుండబట్టే తాను సీఎం అయ్యానని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఓ సీనియర్ మంత్రి వైఎస్సార్ ను తప్పుదోవపట్టిస్తుండేవారని వెల్లడించారు. అనంతరం బాలయ్య అందుకుని, మనం గొప్ప నేతలను, వ్యక్తులను కోల్పోయామని, అలాంటివారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరని పేర్కొన్నారు. 

ఇక, ఈ ఎపిసోడ్ లో వీరికి సీనియర్ నటి రాధిక కూడా తోడవడంతో షోలో నవ్వులు మరింతగా విరబూశాయి. రాధిక... కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ వంటి వారితో నటించినా, తన వంటి సూపర్ స్టార్ తో మాత్రం నటించలేకపోయిందని బాలయ్య చమత్కరించారు. అంతేకాదు, చిరంజీవిలో నచ్చనిది ఏమిటి, నాలో నీకు నచ్చినది ఏమిటి? అంటూ రాధికను ప్రశ్నించారు. ఈ విధంగా ఆయన మరోసారి అన్ స్టాపబుల్-2 టాక్ షోను రక్తికట్టించినట్టు ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.