మాటిచ్చిన 24 గంటల్లోనే చేసి చూపించిన నారా లోకేశ్

17-11-2022 Thu 19:25
  • 'బాదుడే బాదుడు' కార్యక్రమలో పాల్గొన్న లోకేశ్
  • రోడ్ల దుస్థితిని వివరించిన పోల్కంపాడు ప్రజలు
  • వెంటనే స్పందించిన లోకేశ్
  • ఒక్క రోజులో 7 రోడ్ల నిర్మాణం
  • లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
Lokesh stands on his word
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా, పోల్కంపాడు దేవుని మాన్యం ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన 7 రోడ్లు వేయించారు. 

ఈ నెల 15వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుని మాన్యం ప్రాంత ప్రజలు తమ రోడ్ల దుస్థితిని లోకేశ్ కి చూపించారు. వారి పరిస్థితి పట్ల లోకేశ్ వెంటనే స్పందించారు. 

ఈ దుర్మార్గ ప్రభుత్వం అడ్డుకోకుండా వుంటే 48 గంటల్లో మీ రోడ్ల సమస్య పరిష్కరిస్తానని అక్కడిక్కడే హామీ ఇచ్చారు. 24 గంటలు పూర్తి కాక ముందే... ముళ్లపొదలు, గుంతలతో రూపురేఖలు మారిన రోడ్ల మరమ్మతులు ఆరంభించారు. జంగిల్ క్లియరెన్స్ చేయించి, గుంతలు పూడ్చిన తరువాత కంకర చిప్స్ తో ఏడు రోడ్లను సిద్ధం చేయించారు. 

రాత్రి తమ రోడ్ల ఇబ్బందులు తెలుసుకుని, 24 గంటల్లో ఇళ్లకు వెళ్లేందుకు సాఫీగా రోడ్లను వేయించారంటూ స్థానికులు లోకేశ్ కు వేనోళ్ల కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇళ్లు కూలగొట్టడానికి జగన్ రెడ్డి జేసీబీలు పంపిస్తుంటే... తమ ఇళ్లకు దారి వేసేందుకు నారా లోకేశ్ జేసీబీలు పంపిస్తున్నారని ఉండవల్లి దేవుని మాన్యం ప్రాంతీయులు సంతోషం వ్యక్తం చేశారు. 

లోకేశ్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు మంగళగిరి ప్రజలను ఆకట్టుకుంటోంది. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆపదలో వున్నవారిని ఆదుకుంటున్నారు. 

తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సొంత సొమ్ము వెచ్చించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలైతే నేరుగా సంబంధిత అధికారి ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నారు. వారు స్పందించకపోతే... తెలుగుదేశం ప్రభుత్వం  వచ్చిన వెంటనే సమస్య లేకుండా చేసే బాధ్యత తాను తీసుకుంటున్నారు.