Raj Tarun: ఓటీటీ రివ్యూ: 'అహ నా పెళ్లంట'

  • ZEE 5 ద్వారా పలకరించిన 'అహ నా పెళ్లంట'
  • టైటిల్ కి తగిన కామెడీ కనిపించని కథ
  • కథలో కనిపించని కొత్తదనం 
  • ఆసక్తికరంగా సాగని కథనం 
  • నిర్మాణ విలువల పరంగా ఓకే
Aha na Pellanta Web Series Review

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో నిర్మాణ సంస్థలు నిర్మాణ విలువల విషయంలో ఎంతమాత్రం రాజీపడకుండా వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి. అలా ZEE 5వారితో కలిసి తమడ ప్రొడక్షన్స్ వారు ఒక వెబ్ సిరీస్ ను నిర్మిచారు. ఆ వెబ్ సిరీస్ పేరే 'అహ నా పెళ్లంట'. తొలిసారిగా రాజ్ తరుణ్ చేసిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో శివాని రాజశేఖర్ అతని జోడీగా నటించగా, ఆమని .. పోసాని .. హర్షవర్ధన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ రోజునే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా నెటిజనుల ముందుకు వచ్చింది.

సాధారణంగా పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు ఉండగా, చివరి నిమిషంలో పెళ్లి కూతురు తన పేరెంట్స్ కి ఒక లెటర్ రాసి పెట్టేసి తనకి ఇష్టమైనవారితో వెళ్లిపోవడమనే సీన్ చాలా సినిమాలలో చూస్తూ ఉంటాము. అప్పుడు ఆ పెళ్లికూతురు ప్రేమను గురించి అంతా గొప్పగా చెప్పుకుంటారేగానీ, పెళ్లిపీటల మీద తెల్లముఖం వేసుకుని కూర్చున్న పెళ్లికొడుకు గురించి ఎవరూ పట్టించుకోరు. ఆ పెళ్లికొడుకు తన పెళ్లి ఆగిపోవడానికి కారకులైనవారి పెళ్లిని కూడా ఆపేసి, ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది వారికి తెలిసేలా చేయాలనుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ కథ.

 ఈ కథ రాజమండ్రిలో పుట్టి .. హైదరాబాదులో ముగుస్తుంది. రాజమండ్రిలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నారాయణ - సుశీల (హర్షవర్ధన్ - ఆమని) దంపతుల కుమారుడే శీను (రాజ్ తరుణ్). శీను పదేళ్ల వయసులో ఉండగా, ఒక అమ్మాయి విషయంలో అతణ్ణి నారాయణ మందలిస్తాడు. పెళ్లి అయ్యేంత వరకూ అమ్మాయిల వెంటపడనని శీను నుంచి .. అతణ్ణి మరో కారణంగా కొట్టనని భర్త నుంచి సుశీల మాట తీసుకుంటుంది. ఇక తాను ఏ అమ్మాయి వైపు చూసినా తన తండ్రికి ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉండటం గమనించిన శీను, ఇక అమ్మాయిలను గురించిన ఆలోచనే చేయడు. 

రంజీ క్రికెట్ స్థాయిలోనే ఆగిపోయిన నారాయణ, తన కొడుకుని క్రికెటర్ గా చూడాలని అనుకుంటాడు. కానీ శీను క్రికెట్ క్లబ్ లో ఫిజియో థెరఫిస్టుగా జాబ్ మాత్రం సంపాదించగలుగుతాడు. తల్లిదండ్రులు చూసిన 'సుధ'ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అయితే అతను పెళ్లి పీటలపై ఉండగా, అమ్మాయి తనకి ఇష్టమైనవాడితో వెళ్లిపోయిందనే విషయం తెలిసి షాక్ అవుతాడు. ఆ విషయంపై ఊళ్లోని వాళ్లంతా అవమానిస్తూ ఉంటారనే ఉద్దేశంతో శీనుని అతని తండ్రి హైదరాబాద్ పంపిస్తాడు. ఈ తతంగమంతా జరుగుతూ ఉండగానే అతనికి 'మహా' ( శివాని) తారసపడుతుంది. అనుకోకుండానే అతను ఆమె పట్ల ఆకర్షిస్తుడవుతాడు. 

హైదరాబాదులో జాబ్ లో చేరిన శీనుకి అక్కడ సుధ తండ్రి మహేంద్ర (పోసాని) తారసపడతాడు. తన కూతురు సుధ తనకి ఇష్టంలేని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిందనీ, అందుకు తాను చాలా బాధపడుతున్నానని అంటాడు. ఆమె వలన పెళ్లి పీటలపై శీనుకి అవమానం జరిగిందని అంటాడు. సుధ అలా చేయడానికి కారకురాలు 'మహా' అనీ, ఆమె అన్నయ్యతోనే సుధ వెళ్లిపోయిందని చెబుతాడు. 'మహా'కి వసంత్ అనే శ్రీమంతుడితో పెళ్లి కుదిరిందనీ, ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టి, తాము అనుభవించిన బాధ ఎలా ఉటుందనేది ఆమెకి తెలిసేలా చేయాలంటాడు. 

మహేంద్ర చెప్పింది కరెక్టేనని శీనుకి అనిపిస్తుంది. అతను వేసిన ప్లాన్ ప్రకారం మహా పెళ్లికి ముందురోజు తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేస్తాడు. వాళ్లు కిడ్నాప్ చేసే వీడియోను తన దగ్గర పెట్టుకుని, మహాను చంపకపోతే దానిని బయటపెడతానని వాళ్లను మహేంద్ర బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో శీను ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే మలుపులతో కథ నడుస్తూ ఉంటుంది. 

కథాకథనాల విషయానికొస్తే కథలో కొత్తదనం కనిపించదు .. కథనం ఆసక్తికరంగా అనిపించదు. కథ ఎక్కడో మొదలై .. అందరూ ఊహించే మలుపులని తీసుకుంటూ, చివరికి తనస్థాయిని దాటేసి ఎక్కడికో వెళ్లిపోతుంది. తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతే అందుకు కారణం 'మహా' అనుకుని మహేంద్ర ఆమెపై పగబట్టడం, ఆ రోజున సుధ కారణంగా పెళ్లిపీటలపై అవమానం పాలైన శీనుని మహా పైకి ఉసిగొల్పడం, శీను ఆవేశపడిపోయి సుధను వదిలేసి 'మహా'పై పగతీర్చుకునే పనిలో పడటం సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. కథను నాటకీయంగా నడిపించేది పోసాని పాత్రనే. కానీ ఆ పాత్రకే ఒక ప్రయోజనమనేది కనిపించదు. ఆ పాత్ర విషయంలో క్లారిటీ కూడా దొరకదు. 

ఇక హీరో తల్లిదండ్రులు అమ్మాయిల వైపు చూడవద్దని మాత్రమే అతనికి చెబుతారు. అతను ఆ ఒక్క విషయానికి కట్టుబడి మిగతా అన్ని విషయాల్లో చెడిపోతున్నా పట్టించుకోరు. పైగా 'నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నావ్ కదా కన్నా' అంటావు క్లైమాక్స్ లో మెచ్చుకుంటారు కూడా. హీరో .. హీరోయిన్ పాత్రలు .. ఆ పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. ఆ పాత్రలు తీసుకునే నిర్ణయాలు ఎంత మాత్రం ఆసక్తికరంగా అనిపించవు. హీరోకి ఇద్దరు ఫ్రెండ్స్ ను పెట్టి ఆ పాత్రల ద్వారా ..  తాగుబోతూ రమేశ్ కి పోలీస్ ఆఫీసర్ గెటప్ వేయించి ఆ పాత్ర ద్వారా కామెడీని పిండటానికి ట్రై చేశారుగానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గెటప్ శ్రీనుని .. రఘు కారుమంచిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. 

బ్యాక్ గౌండ్ స్కోర్ బాగానే ఉందిగానీ .. పాటలు ఆకట్టుకునేలా లేవు. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. అనవసరమైన సన్నివేశాలు .. సాగదీసిన సన్నివేశాలు అక్కడక్కడా తగులుతూనే ఉంటాయి.  హీరో హీరోయిన్లు కార్లో వెళుతూ ఫ్లైట్ లో బాంబులు పెట్టడానికి సంబంధించిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం అసందర్భంగా అనిపిస్తుంది. అందుకు సంబంధించిన సీన్ ఆ తరువాత పడుతుందని ఊహించడం జరుగుతుంది. క్లైమాక్స్ లో ప్రధానమైన పాత్రలన్నీ ఒక్క దగ్గరికి చేరుకోవాలనే సూత్రాన్ని పాటిస్తూ,  నాటకీయ పరిణామాల మధ్య కథ సుఖాంతమవుతుంది. కథాకథనాల సంగతి అలా ఉంచితే, నిర్మాణ విలువల పరంగా మంచి మార్కులు ఇవ్వదగిన వెబ్ సిరీస్ ఇది.

More Telugu News