Raja singh: నాకొద్దీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం: రాజాసింగ్

  • వాహనం మార్చండి.. లేదా మీరే తీసుకెళ్లండని ఐజీకి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే
  • నాకు ప్రాణహాని ఉందని తెలిసినా ఇలాంటి వాహనం కేటాయిస్తారా? 
  • కొత్త వాహనాలు కేటాయించిన ఎమ్మెల్యేల జాబితాలో తన పేరెందుకు లేదని నిలదీసిన రాజాసింగ్
MLA Raja Singh letter to Telangana intelligence inspector general over bulletproof vehicle

తీవ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందని తెలిసినా తనకు నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణం మధ్యలో రోడ్డుపైన ఆగిపోతున్న వాహనం తనకొద్దని తేల్చిచెప్పారు. సదరు వాహనాన్ని తీసుకెళ్లాలంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి గురువారం లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని ఇటీవల రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! తన భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందని చెప్పినా మళ్లీ అదే వాహనం కేటాయిస్తున్నారని ఈ లేఖలో రాజాసింగ్ ఆరోపించారు. ఈ వాహనంలో ఎక్కడికి వెళ్లలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించినా.. అందులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. ‘నాకు ఇచ్చిన వాహనం మార్చండి.. లేదా దీనిని కూడా తీసుకెళ్లండి. ఇలాంటి వాహనాన్ని ఎలా ఉపయోగించేది?’ అని అన్నారు. ఈమేరకు ఐజీకి రాసిన లెటర్ లో రాజాసింగ్ తేల్చిచెప్పారు.

పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే విడుదలయ్యారు. సోమవారం అఫ్జల్ గంజ్ మీదుగా ప్రయాణిస్తుండగా బుల్లెట్ ప్రూఫ్ కారు మధ్యలో మొరాయించింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. చేసేదేంలేక అక్కడి నుంచి ఆటోలో ఇంటికి చేరుకున్నానని రాజాసింగ్ చెప్పారు.

More Telugu News