Telangana: తెలంగాణలో 18 శాతం మందిలో మధుమేహం

  • జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడి
  • దక్షిణాది రాష్ట్రాల్లోనే సమస్య అధికం
  • ఏపీలో 21.8 శాతం మంది రోగుల్లో అధిక బ్లడ్ షుగర్
  • హెల్త్ స్క్రీనింగ్ తోనే సమస్య వెలుగులోకి
18percent people in Telangana have high blood sugar levels finds national health survey

తెలంగాణలో మధుమేహం చాపకింద నీరులా (తెలియకుండా) విస్తరిస్తోంది. తమకు మధుమేహం ఉన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. జాతీయ కుటుంబ సర్వే 5 వెల్లడించిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 18.1 శాతం మంది అధిక బ్లడ్ షుగర్ స్థాయిలతో బాధపడుతున్నారు. మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా బయటపడుతోంది. 18.1 శాతం మంది పురుషులు, 14.7 శాతం మంది మహిళలు మధుమేహం కోసం ఔషధాలు తీసుకుంటున్నారు. మహిళల్లో 5.8 శాతం మందిలో స్వల్ప స్థాయిలో, 7 శాతం మందిలో అధిక స్థాయిలో బ్లడ్ షుగర్ ఉంటోంది. పురుషుల్లో 6.9 శాతం మందిలో స్వల్పంగా, 9.3 శాతం మందిలో అధికంగా ఉంటోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో మధుమేహం సమస్య ఎక్కువగా ఉంది. కేరళలో 27 శాతం, తమిళనాడులో 22 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 21.8 శాతం మంది మధుమేహం రోగులు అధిక బ్లడ్ షుగర్ తో బాధపడుతున్నారు. ప్రపంచ మధుమేహం దినమైన ఈ నెల 14న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో..  731 మందిలో మొదటి సారి మధుమేహం బయటపడింది. ఇందులో 203 మందికి అధిక రక్తపోటు కూడా ఉంది. వీరిలో మెజారిటీ మందికి అసలు తమకు చక్కెర వ్యాధి, రక్తపోటు ఉన్నట్టే తెలియదట. కనుక మధ్య వయసుకు వచ్చిన వారు నిర్ణీత కాలానికి ఓ సారి వైద్య పరీక్షలకు వెళ్లాలన్నది వైద్యుల సూచనగా ఉంది. మధుమేహం ముందుగా గుర్తించి, నియంత్రణలో ఉంచుకోవడం వల్ల.. రెటీనోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చని సూచిస్తున్నారు.

More Telugu News