రోజూ కూలి పనికి వెళ్లాను .. ఎన్నో అవమానాలు పడ్డాను: ఫైమా 

  • విజేతగా నిలవడం పైనే ఇంటి సభ్యుల దృష్టి 
  • వచ్చే డబ్బుతో సొంత ఇల్లు తీసుకుంటానన్న ఫైమా 
  • సొంత ఇంటిని భార్యకి గిఫ్టుగా ఇస్తానన్న ఆదిరెడ్డి
  • తన తల్లి ట్రీట్మెంట్ కోసం వాడతానన్న శ్రీసత్య  
Bigg Boss 6  Update

బిగ్ బాస్ లో 72వ రోజు మొదలైంది. ఈ సీజన్ లో విజేత గెలుచుకునే మొత్తం గురించి బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ ప్రైజ్ మనీకి సంబంధించిన గేమ్ పోటీదారుల మధ్య కొనసాగింది. బిగ్ బాస్ హౌస్ లో విజేతగా నిలిస్తే, వచ్చిన ఎమౌంట్ ను ఎందుకోసం ఉపయోగిస్తారు? అనేది సభ్యులందరూ చెప్పాలనే ఆదేశం బిగ్ బాస్ నుంచి వచ్చింది. దాంతో సభ్యులు ఒకరి తరువాత ఒకరుగా వచ్చి, తాను విజేతగా నిలిస్తే వచ్చే డబ్బును ఏం చేస్తామనే విషయాన్ని గురించి ఎవరి మనసులోని మాటను వారు చెప్పుకుంటూ వెళ్లారు. 

ఫైమా మాట్లాడుతూ .. "మేము నలుగురం ఆడపిల్లలం. మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెద్ద చేసింది. ఒక చిన్న గదిలో మేమంతా అద్దెకి ఉండేవాళ్లం. నేను ప్రతి రోజూ కూలికి వెళ్లేదానిని. పత్తి ఏరడానికి వెళ్లేదానిని. రోజుకి 100 రూపాయలు వచ్చేవి. అలా నెలకి వచ్చిన మూడు వేలను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వాళ్లం. అయితే మాకంటే ఎక్కువ రెంట్ ఇస్తామని వేరేవారు అనడంతో, ఆ ఇంటి ఓనర్ ఐదు రోజులు మాత్రమే గడువిచ్చి ఆ రూమ్ ను ఖాళీ చేయించాడు. అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చేసరికి చాలా కష్టమైంది. 

అద్దె ఇంటి కోసం చాలా తిరిగాము. ఇంటిముందు 'టు లెట్' బోర్డు ఉన్నా, ఖాళీ లేదని చెప్పేవారు. కొంతమందేమో అంత రెంటు మీరు ఇచ్చుకోలేరు .. వేరే ఇల్లు చూసుకోండి' అనేవారు. అలా చాలా అవమానాలు పడ్డాము. అందువలన మా అమ్మకి ఒక సొంత ఇంటిని గిఫ్టుగా ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను గెలిస్తే ఆ డబ్బుతో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది. ఇక ఆదిరెడ్డి సొంత ఇల్లును తన భార్యకి గిఫ్టుగా ఇస్తానని అంటే, ఆ డబ్బును తన తల్లి ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తానని శ్రీ సత్య చెప్పింది. ఇంటి సభ్యులు తమ పరిస్థితిని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

More Telugu News