Chennai Super Kings: రవీంద్ర జడేజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

  • గత సీజన్ లో చెన్నై జట్టుకు దారుణ పరాజయాలు
  • కెప్టెన్సీ వదులుకున్న జడేజా
  • ఫ్రాంచైజీతో విభేదాలు అంటూ ప్రచారం
  • తాజాగా జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై ఫ్రాంచైజీ
Chennai Super Kings retains Ravindra Jadeja

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన జట్టుగా పేరుగాంచింది. ఐపీఎల్ లో 4 టైటిళ్లు నెగ్గిన చెన్నై జట్టు వచ్చే సీజన్ కోసం నాణ్యమైన జట్టును తయారుచేసేందుకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేసేందుకు నేటితో గడువు ముగియగా, చెన్నై జట్టు కూడా పలువురు ఆటగాళ్లను విడుదల చేసి, కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. 

ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే... గత సీజన్ లో కెప్టెన్సీ చేపట్టి, దారుణ పరాజయాల నేపథ్యంలో కెప్టెన్సీ వదులుకుని, ఆపై గాయంతో సీజన్ కు దూరమైన జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అట్టిపెట్టుకుంది. అతడి ఆల్ రౌండ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచింది. 

ఏ సీజన్ లోనూ ఆడనంత చెత్తగా గత సీజన్ లో చెన్నై జట్టు ఆడింది. కెప్టెన్సీకి జడేజా రాజీనామా చేయగా, చెన్నై జట్టు యాజమాన్యం ఒత్తిడితోనే జడేజా ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రచారం జరిగింది. సీఎస్కే ఫ్రాంచైజీతో జడేజా సంబంధాలు దెబ్బతిన్నాయని, వచ్చే సీజన్ లో జడేజా ఆ జట్టుకు ఆడకపోవచ్చని ఆ కథనాల్లో పేర్కొన్నారు. అయితే అవన్నీ అసత్య కథనాలే అని చెన్నై యాజమాన్యం నేడు నిరూపించింది. జడేజా తమ బృందంలో కీలక సభ్యుడు అని చాటిచెప్పింది.


చెన్నై అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరే...

ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, డెవాన్ కాన్వే, దీపక్ చహర్, మహీశ్ తీక్షణ, పతిరణ, శివమ్ దూబే, సేనాపతి, మిచెల్ శాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్, రాజ్యవర్ధన్ హాంగార్గేకర్, తుషార్ దేశ్ పాండే, ముఖేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి.

More Telugu News