Telangana: ఒకేసారి 8 మెడికల్ కాలేజీల ప్రారంభం.. మంత్రి హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు

CM KCR praises minister Harish  rao
  • తెలంగాణలో 8 నూతన వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • మహబూబాబాద్‌, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు స్వరాష్ట్రం వల్లే సాధ్యమైందని వ్యాఖ్య
  • కళాశాలలను తీసుకువచ్చేందుకు వైద్యశాఖ మంత్రి హరీశ్ చేసిన కృషిపై ప్రశంస
తెలంగాణలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు. 

‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం. ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్‌ సీట్లు, ఇంజినీరింగ్‌ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతోంది. దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. నేడు ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం’ అన్నారు.

మహబూబాబాద్‌, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదని, వీటన్నింటికి కారణం సొంత రాష్ట్రం ఏర్పాటుకావడమే అన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటుతో ఉద్యమకారులుగా పని చేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలనా సారథ్యం స్వీకరించడం, అందులో ప్రముఖ ఉద్యమకారుడు, మంత్రి హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూరూపమైనదని ముఖ్యమంత్రి కొనియాడారు.
Telangana
KCR
Harish Rao
medical colleges

More Telugu News