Andhra Pradesh: వివేకా హత్య కేసు బదలాయింపుపై 21న వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు

supreme court will give verdict on ys vivekananda reddy murder case enquiry to another state on 21st of this month
  • ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి వివేకా కేసును బదలాయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
  • ఇదివరకే వాదనలను పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం
  • మరో జడ్జి అందుబాటులో లేనందున తీర్పును వాయిదా వేస్తున్నానన్న జస్టిస్ ఎంఆర్ షా
  • ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ కూడా ఈ నెల 21కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నెల 21న తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా... తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు (నవంబర్ 14) ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ అంశం నేడు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై తీర్పును వచ్చే సోమవారం ప్రకటిస్తామని జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. బెంచ్ లోని మరో న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగానే తీర్పును వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కూడా జస్టిస్ ఎంఆర్ షా ఈ నెల 21కి వాయిదా వేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి కింది కోర్టులో బెయిల్ పొందారు. ఈ బెయిల్ ను ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. ఫలితంగా సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Andhra Pradesh
YSRCP
YS Jagan
YS Vivekananda Reddy
Supreme Court

More Telugu News