Tanmay Manjunath: పిల్లాడు కాదు పిడుగు... 165 బంతుల్లో 407 రన్స్ తో చరిత్ర సృష్టించాడు!

  • కర్ణాటక క్రికెట్ సంఘం జూనియర్ క్రికెట్లో విధ్వంసక ఇన్నింగ్స్
  • సాగర్ క్రికెట్ క్లబ్ కు ఆడిన తన్మయ్ మంజునాథ్
  • 48 ఫోర్లు, 24 సిక్సర్లతో పరుగుల వర్షం
  • వన్డేల్లో ప్రపంచంలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు 
Tanmay Manjunath creates history by making 407 runs in 50 overs match

భారత దేశవాళీ క్రికెట్లో తన్మయ్ మంజునాథ్ అనే జూనియర్ క్రికెటర్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కర్ణాటక క్రికెట్ సంఘం అండర్-16 టోర్నీలో ఈ పిల్లవాడు చిచ్చరపిడుగులా చెలరేగి చరిత్ర సృష్టించాడు. 

తన్మయ్ మంజునాథ్ ఓ వన్డే మ్యాచ్ లో 165 బంతులాడి ఏకంగా 407 పరుగులు సాధించడం విశేషం. అతడి స్కోరులో 48 ఫోర్లు, 24 సిక్సులున్నాయంటే అతడు ఏ విధంగా ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడో అర్థమవుతుంది. సాగర్ క్రికెట్ క్లబ్ తరఫున ఈ 50-50 మ్యాచ్ ఆడిన తన్మయ్ రికార్డు పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు. 

క్రికెట్ ప్రపంచంలో వన్డేల్లో అత్యధిక స్కోరు ఇప్పుడు తన్మయ్ దే. తన్మయ్ శివాలెత్తిపోవడంతో ఈ మ్యాచ్ లో సాగర్ క్రికెట్ క్లబ్ 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. అయితే ప్రత్యర్థి జట్టు ఎన్టీసీసీ భద్రావతి జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. 16 ఏళ్ల తన్మయ్ సాగర్ లోని నాగేంద్ర క్రికెట్ అకాడమీలో కోచ్ నాగేంద్ర వద్ద శిక్షణ పొందుతున్నాడు. 

అయితే, ఐసీసీ అంతర్జాతీయ వన్డే పోటీల్లో అత్యధిక స్కోరు రికార్డు టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉంది. ఓ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులు సాధించాడు. కాగా, తన్మయ్ మంజునాథ్ కు మంచి భవిష్యత్ ఉందని, అతడు తప్పకుండా టీమిండియాకు ఆడతాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు.

More Telugu News