T20 World Cup: పాక్ ఓటమిని కర్మ అన్న మహ్మద్ షమీకి కౌంటర్ ఇచ్చిన షోయబ్ అక్తర్

  • నిన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి
  • దీన్నే కర్మ అంటారు అంటూ అక్తర్ కు షమీ ట్వీట్
  • దీన్ని సెన్సిబుల్ ట్వీట్ అంటారంటూ  అక్తర్ కౌంటర్
Shoaib Akhtar s Sensible Tweet Jibe At Mohammed Shami Over Karma Reference

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. పాకిస్థాన్ ను ఓడించి ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఓటములతో ఈ టోర్నీని ప్రారంభించిన పాక్ సూపర్ 12 దశలో అద్భుతంగా పుంజుకుంది. వరుసగా మూడు విజయాలకు తోడు, అదృష్టం కూడా తోడవడంతో పాక్ సెమీఫైనల్ చేరుకుంది. అక్కడ న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించడంతో ఫైనల్లోనూ తమ జట్టు గెలిచి రెండోసారి విజేత అవుతుందని పాకిస్థాన్ అభిమానులు, మాజీ ప్లేయర్లు భావించారు. కానీ, ఇంగ్లండ్ చేతిలో పోరాడి ఓడిపోయింది.

 ఈ ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ట్వీట్ చేసి గుండె పగిలిందన్న భావనను వ్యక్తం చేశాడు. దీనిపై భారత పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. ‘సారీ బ్రదర్. దీన్నే కర్మ అంటారు’ అంటూ మూడు బ్రోకెన్ హార్ట్స్ సింబల్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరో సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో పాకిస్థాన్ కు చెందిన పలువురు క్రికెటర్లు, అభిమానులు టీమిండియాను ఎద్దేవా చేసినట్టు మాట్లాడటంతో షమీ ఇలా స్పందించాడు. 

కర్మ పాకిస్థాన్ ను తిప్పికొట్టిందన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనిపై ఇప్పుడు అక్తర్ స్పందించాడు. ‘దీన్ని సెన్సిబుల్ ట్వీట్ అంటారు’ అంటూ పాకిస్థాన్ బౌలింగ్ బలం గురించి భారత కామెంటేటర్ హర్ష భోగ్లే చేసిన ట్వీట్ ను ఆయన ఫొటోతో కలిసి అక్తర్ ట్వీట్ చేశాడు. ‘పాకిస్థాన్ కు క్రెడిట్ ఇవ్వాలి. ఆ జట్టు చేసిన విధంగా 137 పరుగుల లక్ష్యాన్ని కొన్ని జట్లు మాత్రమే కాపాడుకున్నాయి. బెస్ట్ బౌలింగ్ టీమ్ ఇది’ అని భోగ్లే ట్వీట్ చేశాడు. పాక్ బౌలింగ్ ను భారత్ కు చెందిన హర్ష భోగ్లే పొగిడాడంటూ అక్తర్ ట్వీట్ చేశాడు.

More Telugu News