Air show: ఎయిర్ షోలో అపశృతి.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు

  • ఆరుగురు మరణించినట్లు అనుమానాలు
  • అమెరికాలోని టెక్సాస్ లో ప్రమాదం
  • మంటల్లో చిక్కుకుని కూలిన విమానాలు.. వీడియో ఇదిగో..
2 Fighter Planes Collide During US Airshow 6 Feared Dead

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు పొరపాటున ఢీ కొన్నాయి. ఓ విమానం గాల్లోనే పేలిపోగా.. మరో విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ లో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో జరిగిందీ దారుణం.. ఈ ప్రమాదంలో విమానాలను నడుపుతున్న పైలట్లతో సహా ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒక విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానం కావడం గమనార్హం.

వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న బోయింగ్ బీ-17 యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా విమానం రెండూ ఆకాశంలో విన్యాసాలు ప్రారంభించాయి. వైమానిక ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు. ఇంతలో బోయింగ్ బీ-17 విమానం వైపు వేగంగా దూసుకొచ్చిన కింగ్ కోబ్రా క్షణాలలో దానిని ఢీ కొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం, ఆపై కింగ్ కోబ్రా విమానం పేలిపోయింది. బోయింగ్ విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటన మొత్తం సందర్శకుల ఫోన్లలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ప్రమాదానికి గురైన ఆ రెండు విమానాల పైలట్ల పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

More Telugu News