Fisherman: బీచ్ లో పవన్ కల్యాణ్ తనతో ఏం మాట్లాడాడో చెప్పిన మత్స్యకారుడు

Fisherman reveals what Pawan Kalyan talked to him
  • విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • బీచ్ లో విహారం
  • ఓ మత్స్యకారుడితో మాటామంతి
  • మత్స్యకారుడ్ని పలకరించిన మీడియా 
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించడం తెలిసిందే. విశాఖలో బీచ్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ ఓ మత్స్యకారుడితో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో, పవన్ తో మాట్లాడిన మత్స్యకారుడ్ని మీడియా పలకరించింది. తన పేరు జగన్నాథం అని ఆ మత్స్యకారుడు వెల్లడించాడు. పవన్ బీచ్ లో సడెన్ గా కనిపించే సరికి ఆశ్చర్యపోయానని తెలిపాడు. ఆయన పవన్ కల్యాణేనా అనుకుని నమ్మలేకపోయానని పేర్కొన్నాడు. మొదట ఎవరో అనుకున్నానని, దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనే తనను పిలిచారని వివరించాడు. 

మత్స్యకారుల మెరుగైన జీవనానికి ఏంచేస్తే బాగుంటుందో పవన్ అడిగారని ఆ మత్స్యకారుడు వెల్లడించాడు. తాము వేటకు ఉపయోగించే బోట్లకు ఇక్కడికి సమీపంలో డీజిల్ దొరకడం కష్టమైపోతోందని తాను పవన్ తో చెప్పానని తెలిపాడు. ఆ తర్వాత సముద్రంలో దొరికే చేపల గురించి కూడా పవన్ అడిగి తెలుసుకున్నారని ఆ మత్స్యకారుడు వివరించాడు. 

దాదాపు పవన్ 10 నిమిషాల పాటు మాట్లాడారని పేర్కొన్నాడు. తాము ఇక్కడ వేట సాగక, ఇల్లు గడవక పోరుబందర్, మంగళూరు వంటి దూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళుతుంటామని చెప్పానని వెల్లడించాడు. మత్స్యకారుల గురించి ఎక్కువగా అడిగారని, సబ్సిడీల గురించి మాట్లాడారని వివరించాడు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ చెప్పారని తెలిపాడు.
Fisherman
Pawan Kalyan
Beach
Visakhapatnam
Janasena
Andhra Pradesh

More Telugu News