Andhra Pradesh: రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి?.. విపక్షాలను ప్రశ్నించిన మంత్రి బొత్స

ap minister botsa satyanarayana fires on oppositikon partis
  • మోదీ టూర్ పై మీడియా సమావేశం నిర్వహించిన బొత్స
  • రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమేనని వెల్లడి
  • విపక్షాలకు ఓ సెక్షన్ మీడియా వంత పాడుతోందని ఆరోపణ
  • పేదలకు ఇళ్లపైనా రాజకీయం చేస్తున్నారని మండిపాటు
విశాఖ పరిధిలోని రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం స్పందించారు. రిషికొండలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా ఆయన తిప్పికొట్టారు. రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పూర్తయిన సందర్భంగా మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్, స్థానిక ఎంపీ సత్యనారాయణతో కలిసి బొత్స మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

రిషికొండలో జరుగుతున్న నిర్మాణాలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిశీలించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... అసలు కొండపై ప్రభుత్వ నిర్మాణాలతో విపక్షాలకు వచ్చిన నష్టమేమిటని బొత్స ప్రశ్నించారు. గతంలోనూ రిషికొండపై నిర్మాణాలు ఉన్నాయి కదా? అన్నారు. రిషికొండపై ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్న ఆయన... రిషికొండపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. రిషికొండ నిర్మాణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న బొత్స... వాటిని విపక్షాలకు కొమ్ము కాస్తున్న మీడియా భూతద్ధంలో చూపిస్తోందని విమర్శించారు.

ప్రధాని సభలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం వైఎస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని బొత్స అన్నారు. ప్రజల అవసరాలను సీఎం ప్రధాని దృష్టికి హుందాగా తీసుకెళ్తారని చెప్పారు. కానీ కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యంగా మారాయని ఆయన మండిపడ్డారు. విశాఖ సభ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ మంచి మెసేజ్‌ ఇచ్చారని మంత్రి తెలిపారు. 

ఆదివారం ఉదయం విజయనగరం పర్యటనకు జనసేన నాయకుడు పవన్‌ వెళ్తారట అని బొత్స వ్యంగ్యం ప్రదర్శించారు. జగనన్న కాలనీలు చూసేందుకు పవన్ వెళుతున్నారన్న బొత్స.. విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద లే అవుట్‌ ఎక్కడా లేదన్నారు. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. జగనన్న కాలనీల పేరుతో కొత్తగా ఊర్లు కడుతున్నామన్న బొత్స... కాలనీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లపై కూడా రాజకీయం చేస్తున్నారన్న మంత్రి... గతంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు పేదలకు ఇళ్లు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు.
Andhra Pradesh
Vizag
Botsa Satyanarayana
Gudivada Amarnath
Prime Minister
Narendra Modi
YSRCP
YS Jagan
Vijayanagaram District
Janasena
Pawan Kalyan

More Telugu News