తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వాళ్లు... మోదీ కక్కిన విషాన్ని వేరు చేస్తారు: మంత్రి జగదీశ్ రెడ్డి

12-11-2022 Sat 18:29 | Telangana
  • తెలంగాణలో మోదీ పర్యటన
  • టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • కేసీఆర్ పై ప్రధాని విషం కక్కారన్న మంత్రి జగదీశ్ రెడ్డి
  • తెలంగాణ ప్రజలను మోసపుచ్చలేరని స్పష్టీకరణ
Telangana minister Jagadish Reddy replies to PM Modi remarks
తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయిందన్న అక్కసు ఇవాళ ప్రధాని మోదీ మాటల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు. 

సీఎం కేసీఆర్ పై విషం చిమ్మే అజెండాతో మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారని విమర్శించారు. అవాస్తవాలతో పునాదులు వేసి బీజేపీని విస్తరించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం రగిల్చేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. 

అయితే తెలంగాణ ప్రజలేమీ గుజరాత్ ప్రజల్లాంటి వారు కాదని, ఇలాంటి మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసపుచ్చలేరని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని, హంసలు పాలను, నీళ్లను వేరు చేసినట్టు, తెలంగాణ ప్రజలు విషాన్ని వేరు చేస్తారని వివరించారు.