Whatsup: ఒక్క వాట్సాప్ మెసేజ్.. అత్యాచార నిందితుడిని జైలుకి పంపించింది!

  • అస్సాంలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య
  • లంచాలు ఇచ్చి కేసు నుంచి బయటపడ్డ నిందితుడు
  • ముఖ్యమంత్రికి మెసేజ్ చేసిన స్థానిక జర్నలిస్టు
  • సీఐడీ విచారణకు సీఎం ఆదేశం.. వెలుగులోకి అసలు నిజాలు
How A WhatsApp Tip Uncovered Assam 13Year Olds Rape And Murder

పదమూడేళ్ల బాలిక అనుమానాస్పదంగా చనిపోతే ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసులు కేసును క్లోజ్ చేశారు.. తమ కూతురిపై అఘాయిత్యం జరిగిందని, దోషులను పట్టుకుని శిక్షించాలని తల్లిదండ్రులు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తల్లిదండ్రుల ఆవేదన చూసి చలించిపోయిన స్థానిక జర్నలిస్టు ఒకరు ముఖ్యమంత్రికి వాట్సాప్ చేశాడు. 

అంతే.. కేసులో మళ్లీ కదలిక వచ్చింది. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా పలువురు అధికారులపై వేటు పడింది. బాలిక మరణానికి కారణమైన జవానును జైలుకు పంపించింది. బాలిక తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చింది. ఇదంతా జరగడానికి ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ కారణమైంది. అస్సాంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలోని దరంగ్ జిల్లాకు చెందిన క‌ృష్ణ కిశోర్ భరూవ సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. శసస్త్ర సీమా బల్ లో జవాను.. ఆయన ఇంట్లో పనిచేసే పదమూడేళ్ల బాలిక అనుమానాస్పదంగా చనిపోయింది. తమ కూతురిపై అఘాయిత్యం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. అత్యాచారం జరిగిన దాఖలాల్లేవని వైద్యులు రిపోర్టు ఇవ్వడంతో ఈ కేసును పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కొంతకాలానికి బాలికది ఆత్మహత్యేనని తేల్చేసి, కేసును మూసేశారు. తమ కూతురుకు న్యాయం జరగాలని ఆ తల్లిదండ్రులు కనిపించిన ప్రతీ ఒక్కరికీ తమ ఆవేదన చెప్పుకున్నారు. స్థానిక జర్నలిస్టు ఒకరు ఈ తల్లిదండ్రుల ఆవేదన చూసి ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మకు వాట్సాప్ చేశాడు. ముఖ్యమంత్రి స్పందించి సీఐడీ విచారణ జరిపించాలని ఆదేశించాడు.

సీఐడీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సదరు జవాను ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడని తేలింది. తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోస్ట్ మార్టం చేసిన వైద్యులకు, పోలీసులకు, అధికారులకు లంచాలు ఇచ్చాడని బయటపడింది. దీంతో ఆ జవానును అరెస్టు చేయడంతో పాటు ఆయనకు సహకరించిన విశ్రాంత పోలీసు అధికారిని కూడా అధికారులు జైలుకు పంపారు. తప్పుడు నివేదిక ఇచ్చిన ముగ్గురు డాక్టర్లను, జిల్లా కలెక్టర్ ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

More Telugu News