Bilkis Bano: బిల్కిస్ బానో అత్యాచార దోషులను సంస్కారవంతులుగా అభివర్ణించిన నేతకు బీజేపీ టికెట్!

  • 2017లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన చంద్రసింహ్ రౌల్జీ
  • బిల్కిస్ బానో దోషులను విడిచిపెట్టాలన్న కమిటీలో ఆయన కూడా సభ్యుడు
  • గోద్రా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రౌల్జీ
MLA Who Called Bilkis Bano Convicts Sanskari Is BJP Candidate From Godhra

దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసు దోషులను ‘సంస్కారవంతులైన బ్రాహ్మణులు’గా అభివర్ణించిన గుజరాత్ మాజీ మంత్రి చంద్రసింహ్ రౌల్జీకి బీజేపీ గోద్రా టికెట్ కేటాయించింది. బిల్కిస్ బానో దోషులను వదిలిపెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన ప్రభుత్వ కమిటీలో రౌల్జీ కూడా సభ్యుడు కావడం గమనార్హం. 

గోద్రా నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆపై మూడేళ్ల వయసున్న ఆమె కుమార్తె సహా 9 మంది కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో 11 మంది దోషులు జైలు శిక్ష అనుభవిస్తుండగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న వారిని విడుదల చేశారు.

జైలు నుంచి విడుదలైన వారికి కొందరు పూలమాలలతో స్వాగతం పలికి, స్వీట్లు పంచిపెట్టి పండుగ చేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. కాగా, రౌల్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిల్కిస్ బానో అత్యాచార దోషులను సంస్కారవంతులైన బ్రాహ్మణులుగా అభివర్ణించారు. వారిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని శిక్షించారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు, జైలులో వారి ప్రవర్తన చాలా బాగుందని కూడా పేర్కొన్నారు. 

రౌల్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీశ్‌రెడ్డి గతంలో ఈ వీడియోను పోస్ట్ చేసి.. రేపిస్టులను బీజేపీ సంస్కారవంతులుగా చెబుతోందని, బీజేపీ ఇంతటి అథమస్థాయికి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 2017 గుజరాత్ ఎన్నికలకు ముందు రౌల్జీ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

More Telugu News