Elon Musk: ఇలా అయితే ట్విట్టర్ దివాలాయే: ఎలాన్ మస్క్

Elon Musk warns of bankruptcy as more top Twitter executives quit
  • భారీ నష్టాలతో కొనసాగలేమన్న ట్విట్టర్ యజమాని
  • పోటీలో ఉండాలంటే మరిన్ని నిధులు తేవాల్సిందేనన్న అభిప్రాయం
  • లేదంటే దివాలా తప్పదని వ్యాఖ్య
ట్విట్టర్ ప్లాట్ ఫామ్ ను ఎలాన్ మస్క్ అసలు ఏం చేద్దామనుకుంటున్నాడు? ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఎదురవుతున్న సందేహం. ట్విట్టర్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన రెండు వారాల్లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద చర్చకు అవకాశమిచ్చాడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ముఖ్యంగా వచ్చీ రావడంతోనే భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ను ట్విట్టర్ సీఈవోగా పీకి పారేశాడు. లీగల్ హెడ్ గా ఉన్న విజయ గద్దె, సీఎఫ్ వో తదితర కీలక స్థానాల్లోని నలుగురిని మొదటి రోజు ఉద్వాసన పలికాడు మస్క్. 

అంతేకాదు సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించడం అతిపెద్ద నిర్ణయం. దీనిపై ట్విట్టర్ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విమర్శలు పెరగడంతో ‘సారీ, తప్పు జరిగింది. మళ్లీ వెనక్కి రండంటూ’ ట్విట్టర్ కొందరికి కబురు పంపింది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంస్థలో మిగిలిన ఉద్యోగుల్లో కీలక స్థానాల్లోని వారు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. యోల్ రాత్, రాబిన్వీలర్ తాజాా ట్విట్టర్ కు రాజీనామా ఇచ్చేశారు. 

మరోవైపు ట్విట్టర్ దివాలా తీయవచ్చంటూ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఖర్చు పెడుతున్నదానికంటే మరిన్ని నిధులను సంస్థలోకి తీసుకురావాల్సి ఉంది. అప్పుడే పోటీలో నిలవగలం. అలా చేయకపోతే భారీగా ప్రతికూల నగదు ప్రవాహాలు (నష్టాలు) కొనసాగుతాయి. అదే జరిగితే దివాలాను తోసిపుచ్చలేం. భారీ నష్టాలతో 100 కోట్ల మంది యూజర్లకు చేరువ కాలేం. అది గిట్టుబాటు కాదు’’ అని మస్క్ పేర్కొన్నట్టు సమాచారం.

ట్విట్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న లీకిస్నర్ సైతం సంస్థకు గుడ్ బై చెప్పేశారు. అలాగే, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ మారియానా ఫోగర్టీ కూడా రాజీనామా ఇచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే మస్క్ తన చర్యలతో ఉద్యోగులను అభద్రతా భావంలోకి నెట్టినట్టు కనిపిస్తోంది. ఒంటెత్తు పోకడలు పనికి రావని ఆయన గ్రహించేలోపు మరింత నష్టం జరుగుతుందేమో చూడాలి. 


Elon Musk
warns
bankruptcy
Twitter
resignations

More Telugu News