T20 World Cup: ఘోరంగా ఓడిపోయిన భారత్... టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్

England beat india by 10 wickets and enters in to t20 world cup final
  • 20 ఓవర్లలో 168 పరుగులు చేసిన టీమిండియా
  • ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్
  • 80 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జాస్ బట్లర్
  • కెప్టెన్ ను మించి వీర విహారం చేసిన అలెక్స్ హేల్స్
  • భారత్ పై 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆంగ్లేయుల జట్టు 
టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీమిండియా టైటిల్ పోరుకు ఒక్క అడుగు దూరంలో చతికిలబడిపోయింది. గురువారం ఇంగ్లండ్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో భారత్ జట్టు ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్ లో ఫరవాలేదనిపించిన భారత జట్టు... బౌలింగ్ లో మాత్రం అత్యంత పేలవ ప్రదర్శనను కనబరచింది. ప్రత్యర్థి జట్టు వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమైపోయిన భారత బౌలర్లు... ఇంగ్లండ్ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలో మరింతగా విఫలమయ్యారు. వెరసి ఈ మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్ చేరుతుందన్న సగటు క్రికెట్ అభిమానుల ఆశలను రోహిత్ శర్మ సేన వమ్ము చేసింది. సెమీస్ లో ఘోర పరాభవంతో టీమిండియా రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టింది. 

టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ ను ఎంచుకోగా... ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో తడబడింది. ఎప్పటిలానే ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలమైతే... అప్పటిదాకా వీర విహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ కీలక మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఆ ఇద్దరి బాటలోనే రిషబ్ పంత్ కూడా చేతులెత్తేశాడు. ఇక జట్టుకు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో విరుచుకుపడినా ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫరవాలేదనిపించినా కూడా జట్టుకేమీ ప్రయోజనం కలగలేదు.

169 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ కు తోడుగా మరో ఎండ్ లో ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన అలెక్స్ హేల్స్ కెప్టెన్ ను మించి స్వైర విహారం చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో సింగిల్ వికెట్ పడకుండానే వీరిద్దరే తమ జట్టుకు విజయాన్ని అందించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి తీసుకెళ్లారు. మొదటి బంతి నుంచే బాదుడు ప్రారంభించిన బట్లర్, హేల్స్... భారత బౌలర్లను చీల్చి చెండాడారు. 48 బంతులను ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో 47 బంతులను మాత్రమే ఎదుర్కొన్న హేల్స్ 4 ఫోర్లు, 7 సిక్స్ లతో ఏకంగా 86 పరుగులు రాబట్టాడు. ఫలితంగా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే ఇంగ్లండ్ జట్టు ఇంకో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 170 పరుగులు చేసింది. భారత్ పై 10 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్ చేరింది.
T20 World Cup
England
Team India
Semi Final
Jos Buttler
Alex Hales

More Telugu News