heater: కరెంట్ బిల్ చూపిస్తేనే హీటర్లు అమ్మండి.. కశ్మీర్ లో దోడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు

  • దుకాణాలకు నోటీసులు పంపిన కలెక్టరేట్
  • విద్యుత్ చౌర్యం నివారించేందుకేనని వివరణ
  • చలికాలంలో విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరణకు కొత్త నిర్ణయం
curbs on heating gadgets sales in kashmir

చలికాలంలో ఇంట్లో వెచ్చదనం కోసం హీటర్ కొనాలనుకుంటే పర్సులో డబ్బులు ఉంటే సరిపోదు.. కరెంట్ బిల్లు కట్టిన రసీదు కూడా కావాలంటున్నారు కశ్మీరీ వ్యాపారులు. అదేంటి కరెంట్ బిల్లు రసీదుతో వాళ్లకేం సంబంధం అని అడిగేలోపే అవి కలెక్టర్ ఆదేశాలని జవాబిస్తున్నారు. 

హీటర్లు, గీజర్ల అమ్మకాలపై జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందంటున్నారు. కరెంట్ బిల్లు కట్టిన రసీదు ఉంటే తప్ప హీటరు కానీ గీజర్ కానీ.. ఇలాంటి వస్తువులు అమ్మేదిలేదని తేల్చిచెబుతున్నారు. కశ్మీర్ లోని దోడా జిల్లా వాసులకు ఎలక్ట్రానిక్ షాపులలో ఈ అనుభవం ఎదురవుతోంది. ఈ కొత్త ఆదేశాలు ఎందుకు జారీ చేశారని అంటే విద్యుత్ చౌర్యం అరికట్టడానికేనని జవాబు వినిపిస్తోంది.

కశ్మీర్ లో చలికాలం వచ్చిందంటే కరెంట్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. వచ్చే డిమాండ్ కు సరిపడా కరెంట్ సప్లై చేయలేక తరచుగా అధికారులు కరెంట్ కోతలు విధిస్తుంటారు. పైగా కరెంట్ వాడకమేమో ఎక్కువ, వసూలయ్యే బిల్లుల మొత్తమేమో తక్కువ. రెండింటికీ పొంతన లేకుండా పోతోందట. దీంతో విద్యుత్ దొంగల ఆటకట్టించి, కరెంట్ వాడకాన్ని క్రమబద్ధీకరించాలని దోడా జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. కరెంట్ కనెక్షన్ ఉన్న వాళ్లకు, వారిలోనూ కిందటి నెల బిల్లు కట్టినవాళ్లకే గీజర్లు, హీటర్లు అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మేలు కలుగుతుందని కలెక్టర్ చెప్పారు.

More Telugu News