Tomato: కర్నూలులో కిలో రెండు రూపాయలకు పడిపోయిన టమాటా ధర.. బోరుమంటున్న రైతులు

  • కర్నూలు మార్కెట్‌కు నిన్న 350 క్వింటాళ్ల టమాటా
  • ఓ మాదిరిగా ఉన్న టమాటాను కిలోకు రూ. 4కు కొనుగోలు చేసిన వ్యాపారులు
  • మిగతా వాటికి అర్ధ రూపాయి కూడా రాదనడంతో రైతుల దిగాలు
  • తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్లోనే పారబోసిన రైతులు
Kilo Tomato for Rs 2 in Kurnool market

కర్నూలు జిల్లా టమాటా రైతులు బోరుమంటున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో భారీగా పలికిన టమాటా ధర ఒక్కసారిగా 2 రూపాయలకు పడిపోవడంతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన టమాటాను అమ్మలేక, అలాగని తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్లోనే వాటిని పారబోస్తున్నారు. మార్కెట్‌కు నిన్న 350 క్వింటాళ్ల టమాటా వచ్చింది. వాటిలో ఓ మాదిరిగా ఉన్న టమాటా ధర కిలోకు రూ. 4 పలకగా, మిగతా వాటికి కిలోకు అర్ధ రూపాయి కూడా రాదని వ్యాపారులు చెప్పడంతో రైతులు నిర్ఘాంతపోయారు. 

దిక్కుతోచని రైతులు వాటిని అక్కడే పారబోసి వెళ్లిపోయారు. ఒక ఎకరాలో టమాటా పంట పండించేందుకు రైతులు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చాక ధర అమాంతం పడిపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో టమాటా రూ. 20 నుంచి రూ. 30 పలుకుతుండడం గమనార్హం. కిలోకు రూ. 10-15 అయినా లభిస్తే తమకు కొంతవరకు గిట్టుబాటు అయ్యేదని రైతులు చెబుతున్నారు.

More Telugu News