Telangana: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో?.. ప్రగతి భవన్ లా రాజ్ భవన్ కాదు: గవర్నర్ తమిళిసై

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి రాజ్ భవన్ ను లాగే యత్నం చేశారన్న తమిళిసై
  • అందుకే తుషార్ పేరును తెరమీదకు తెచ్చారని ఆరోపణ
  • తుషార్ తన వద్ద ఏడీసీగా పనిచేశారని వెల్లడి
  • పరిశీలన తర్వాతే బిల్లులపై సంతకం పెడతానన్న గవర్నర్
ts governor tamilisai fires on telangana government again

తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందేమోనన్న అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్... ప్రగతి భవన్ లా కాదని, రాజ్ భవన్ ద్వారాలు జనం కోసం నిత్యం తెరిచే ఉంటాయని కూడా ఆమె అన్నారు. ఈ మేరకు బుధవారం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సర్కారుపై ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు.


ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న కేసులో రాజ్ భవన్ ను ఇరికించేందుకు యత్నించారని తమిళిసై అన్నారు. ఇందులో భాగంగానే గతంలో తన వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ పేరును ప్రస్తావించారని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో రాజ్ భవన్ పాత్ర ఉందని చెప్పే విధంగా అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో పోస్టులు పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. ఫలితంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందన్నారు. తన ఫోన్ ను ట్యాప్ చేయాలనుకుంటే...దొంగ దారులు అవసరం లేదన్న తమిళిసై.. తానే స్వయంగా తన ఫోన్ ను అప్పగిస్తానని తెలిపారు. 

ప్రభుత్వ బిల్లులు రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తమిళిసై అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను పరిశీలించిన తర్వాతే తాను వాటిపై సంతకం చేస్తానన్నారు. ఇది తన విధి కూడా అని ఆమె పేర్కొన్నారు. ఆయా అంశాల్లో తప్పులు దొర్లకూడదంటే ఆయా బిల్లులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. తాను ఇప్పుడు చేస్తున్నది అదేనన్నారు. ప్రభుత్వం పంపిన బిల్లులను తాను పరిశీలిస్తున్నానని, అది కూడా ప్రాధాన్యతాంశాల వారీగా పరిశీలన జరుగుతోందన్నారు. చాలా అంశాల్లో తాను చేసిన సూచనల తర్వాతే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.

More Telugu News