T20 World Cup: రేపు ఒక్క రోజు విశ్రాంతి తీసుకోవా ప్లీజ్... కోహ్లీకి కెవిన్ సరదా సలహా

England ex cricketer Kevin Pietersen funny suggestion to viratkohli
  • రేపే ఇంగ్లండ్, టీమిండియాల మధ్య రెండో సెమీ ఫైనల్
  • నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన కోహ్లీ
  • ఆ వీడియోను చూసి కోహ్లీకి సరదా సలహా ఇచ్చిన కెవిన్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ ముగియగా... బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య జరుగుతోంది. ఇక గురువారం రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ రెండు మ్యచ్ లలో విజయం సాధించే జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో భీకర ఫామ్ తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ జట్టు మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఓ ఆసక్తికర సలహా ఇచ్చాడు. తన దేశ జట్టుతో జరిగే మ్యాచ్ ఆడకుండా రెస్ట్ తీసుకోవాలంటూ కెవిన్ సరదా సలహా ఇచ్చాడు. సెమీ ఫైనల్ సన్నాహాల్లో భాగంగా బుధవారం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న తన వీడియోను కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూస్తుంటే... రేపటి సెమీస్ లో ఆంగ్లేయులకు పట్ట పగలే చుక్కలు కనిపించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. 

ఈ వీడియోను చూసిన కెవిన్... కోహ్లీని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశాడు. ''గురువారం డే ఆఫ్ తీసుకోవచ్చు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. కానీ రేపు ఒక్క రోజు విశ్రాంతి తీసుకో ప్లీజ్'' అంటూ కోహ్లీకి కెవిన్ సూచించాడు. కోహ్లీ ఆడకుంటే తన దేశ జట్టు సెమీస్ గెలిచి ఫైనల్ చేరుతుందన్న భావన వచ్చేలా కెవిన్ ఈ సరదా సూచన చేశాడు. కోహ్లీ, కెవిన్ ల మధ్య మంచి స్నేహం ఉంది. ఈ చొరవతోనే కోహ్లీకి కెవిన్ సరదా సలహా ఇచ్చాడు.
T20 World Cup
Team India
England
Kevin Pietersen
Virat Kohli

More Telugu News