goa: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రైవేటు అనుభవం కావాలట.. గోవా ప్రభుత్వం కొత్త రూల్!

One year work experience mandatory for govt jobs in Goa
  • భవిష్యత్తులో నేరుగా ఉద్యోగంలోకి తీసుకోబోమని ప్రకటన
  • ప్రైవేటులో ఏడాది అనుభవం తప్పనిసరి చేస్తూ త్వరలో ఆదేశాలు
  • నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసమేనని సీఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్య
ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికలో గోవా ప్రభుత్వం సరికొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడాది పాటు ఏదైనా ప్రైవేటు సంస్థలో పనిచేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొంది. ఈమేరకు నిబంధనలలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుభవంలేని వాళ్లను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.

ప్రైవేటులో అనుభవం రూల్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారని ముఖ్యమంత్రి వివరించారు. ఈమేరకు ఉత్తర గోవా జిల్లాలోని తలీగావ్ గ్రామంలో ప్రమోద్ సావంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ రూల్ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనుకుంటే ముందు ప్రైవేటు రంగంలో ఏడాది పాటు పని చేయాలని యువతకు సూచించారు. అదేవిధంగా ఉద్యోగం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఉద్యోగ అనుభవంతో యువతకు బాధ్యతలు తెలిసొస్తాయని, నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరుకుతారని ఆయన వివరించారు.
goa
pramod sawanth
govt jobs
job experience
private

More Telugu News