buying: ఇల్లు కొనే ముందు ఈ ఐదింటిని తెలుసుకోవాలి

  • ఇంటి ధరకు అదనంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ తదితర చార్జీలు
  • అన్ని వివరాలు విచారించుకున్న తర్వాతే కొనుగోలుకు డీల్
  • క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే తక్కువ రేటుకే రుణం
5 mistakes to avoid while buying your dream home

సొంతిల్లు జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. అంతేకాదు, ఎంతో ఖరీదైనది కూడా. భారీ మొత్తాన్ని ఖర్చు చేసి కొనుగోలు చేసే ఇంటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను ముందుగానే తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

బడ్జెట్..
ఇంటికి చెల్లించే మొత్తం కాకుండా, జీఎస్టీ ఇతర చార్జీలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం చదరపు అడుగు ధరనే కాకుండా.. ఇంటి మొత్తం విలువపై జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజీ తదితర చార్జీలు అన్నింటినీ కలుపుకుంటే ప్రతి రూ.100 మొత్తంపై మరో రూ.20-30 అదనపు భారం పడుతుంది.

ధర, ప్రాంతం
ఇంటిని కొనుగోలు చేసే ముందు తగిన పరిశీలన తప్పనిసరి. ముఖ్యంగా కొనుగోలు ధర, ప్రాంతం విషయమై స్పష్టతకు రావాలి. తర్వాత ఎంత విస్తీర్ణం, ఇంటికి కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలను కూడా చూడాలి. కొనుగోలు చేస్తున్న ప్రాంతం అభివృద్ది చెందిందా, ఇంకా చెందాల్సిన దశలోనే ఉందా? ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో అయినా అక్కడ తగినన్ని వసతులు ఏర్పడతాయా? అన్నవి చూడాలి. బిల్డర్ గత ప్రాజెక్టుల పనితీరు చూడాలి. అన్నిరకాల అనుమతులు ఉన్నాయా, అవి నిజమైనవా, కావా? ధ్రువీకరించుకోవాలి.

తొందర వద్దు
ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు సరిపడా ఏర్పాట్లు మీవైపు ఉంటే వెంటనే ఎక్కడో ఒక చోటు కొనేయడం సరికాదు. నిపుణుల సూచనలతో కనీసం 10 ప్రాజెక్టులను పరిశీలించి, ధరకు తగ్గ ప్రాపర్టీని ఎంపిక చేసుకోవాలి. బిల్డర్లు ఇచ్చే ఆఫర్ల మాయలో పడొద్దు.

రుణం
ఇంటి రుణం కనీసం 20-25 ఏళ్ల కాలంతో ఉంటుంది. కనుక వడ్డీ రేటు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక వడ్డీ రేటు పడితే దీర్ఘకాలంలో అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మరి ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు గృహ రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలి. కనీసం 780కు పైన స్కోరు ఉండేలా ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. అంతేకాదు 750కు దిగువన క్రెడిట్ స్కోరు లేకుండా చూసుకోవాలి. 

డౌన్ పేమెంట్
ఇంటి కొనుగోలు లేదా నిర్మాణ వ్యయంలో బ్యాంకులు 75 శాతం వరకే రుణంగా ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని రుణ గ్రహీత తన వంతు వాటాగా సమకూర్చుకోవాలి.

More Telugu News