Fake bank: తమిళనాడులో ఉత్తుత్తి బ్యాంక్.. దాడులు చేసి మూసేసిన పోలీసులు

  • గ్రామీణ రైతుల సహకార బ్యాంకు పేరుతో ఏర్పాటు
  • చెన్నై సహా తొమ్మిది చోట్ల బ్రాంచీలు కూడా..
  • రిజర్వ్ బ్యాంక్ ఫిర్యాదుతో సూత్రధారిని అరెస్టు చేసిన పోలీసులు
Fake bank operating in Tamil Nadu busted

నకిలీ నోట్లను తయారు చేయడం పాత ట్రెండ్.. అందుకే, తమిళనాడులో ఓ కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకునే తెరిచేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏమాత్రం తీసిపోకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరిచి, డిపాజిట్లు తీసుకున్నాడు. మరో తొమ్మిది బ్రాంచీలను తెరిచి విజయవంతంగా దందా కొనసాగించాడు. దాదాపు ఏడాదిపాటు నిరాటంకంగా నడిచిన బ్యాంకులు ఆర్బీఐ ఫిర్యాదుతో మూతపడ్డాయి. తమిళనాడులో జరిగిన ఈ ఘటన వివరాలు..

తమిళనాడుకు చెందిన చంద్రబోస్ అనే యువకుడు చెన్నైలో ఓ బ్యాంకును తెరిచాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ‘గ్రామీణ రైతుల సహకార బ్యాంకు’ అని పేరు పెట్టాడు. లండన్ లో చేసిన ఎంబీయే డిగ్రీతోను, గత ఉద్యోగ అనుభవంతోనూ పకడ్బందీగా బ్యాంకును ఏర్పాటు చేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తమ బ్యాంకుకు గుర్తింపు ఉందని చూపించుకునేందుకు ఓ నకిలీ సర్టిఫికెట్ ను తయారు చేశాడు. మిగతా బ్యాంకుల తరహాలోనే డిపాజిట్, విత్ డ్రా స్లిప్పులు, స్టాంపులతో పాటు సిబ్బందిని నియమించుకుని బ్యాంక్ ను నడిపించాడు. ఉద్యోగం ఇవ్వడానికి కూడా రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా వసూలు చేశాడట.

చెన్నైలో తన ప్రయోగం సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాల్లో బ్రాంచీలు తెరిచాడు. మొత్తంగా 46 మందిని మేనేజర్లు, క్యాషియర్లు, క్లర్కుల పేరుతో నియమించుకున్నాడు. కొత్త ఖాతాలను తెరవడంతో పాటు, డిపాజిట్ల పేరుతో రూ. 2 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేశాడు. తమిళనాడులో నడుస్తున్న ఈ బ్యాంకు వ్యవహారం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ బ్యాంకుకు గుర్తింపు లేదని, ఫోర్జరీ సర్టిఫికెట్ తో బ్యాంకును తెరిచారని పోలీసులకు ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చైన్నై, మధురై, సాలెం, ఈరోడ్, నమక్కల్, కల్లాకురిచి, పెరంబలూర్, వృద్దాచలం, తిరువన్నామళైలలోని బ్యాంకు బ్రాంచీలపై దాడులు చేశారు. ఉద్యోగులతో పాటు బ్యాంకును ఏర్పాటు చేసిన చంద్రబోస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డిపాజిటర్ల నుంచి సేకరించిన నగదును ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేసినట్లు వెల్లడించడంతో ఆ ఖాతాను సీజ్ చేశారు. ప్రస్తుతం అందులో రూ. 56 లక్షలు ఉందని పోలీసులు చెప్పారు. బ్యాంకు బ్రాంచీలను అన్నింటినీ మూసేసినట్లు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ వివరించారు.

More Telugu News