Nepal: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఢిల్లీలోనూ కంపించిన భూమి

3 Killed As over 6 Magnitude Earthquake Hits Nepal
  • అర్ధరాత్రి 1.57 గంటల సమయంలో ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదు
  • ఇల్లు కూలి ముగ్గురి మృతి
  • 2015లో సంభవించిన భూకంపంలో 8,964 మంది మృతి
నేపాల్‌లో గత అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు కనిపించాయి. ముఖ్యంగా గురుగ్రామ్, నోయిడాలలో పది సెకన్లపాటు ప్రకంపనలు కనిపించాయి. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత అర్ధరాత్రి 1.57 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేపాల్ జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. 

నేపాల్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, అర్ధరాత్రి దాటిన తర్వాత మరింత తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం కారణంగా నేపాల్‌లో ఓ ఇల్లు కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

నేపాల్‌లో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అక్టోబరు 19న ఖాఠ్మండులో 5.1 తీవ్రతతో భూకంపం రాగా, జులై 31న 6.0 తీవ్రతతో భూమి కంపించింది. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపం కారణంగా దాదాపు 8,964 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 22 వేల మంది గాయపడ్డారు.
Nepal
New Delhi
Earthquake

More Telugu News