Congress: కాంగ్రెస్ కు ఊరట... పార్టీ ట్విట్టర్ ఖాతాల రద్దును నిలుపుదల చేసిన కర్ణాటక హైకోర్టు

Karnataka High Court has set aside the exparte order of a Bengaluru Court which ordered blocking of congress and bharat jodo twitter handles
  • భారత్ జోడో యాత్రల వీడియోలకు కేజీఎఫ్ 2 పాటలను జోడించిన కాంగ్రెస్
  • ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనతేలపై కేసు
  • కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ ఖాతాలను రద్దు చేయాలంటూ బెంగళూరు కోర్టు ఆదేశం
  • బెంగళూరు కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టులో సవాల్ చేసిన కాంగ్రెస్ పార్టీ 
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వీడియోలకు కేజీఎఫ్-2 పాటలను జోడించారన్న వివాదంలో మంగళవారం కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ వివాదంపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేయగా... కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ ఖాతాలను రద్దు చేయాలంటూ బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు కోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ సవాల్ చేయగా.. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు నిలుపుదల చేసింది.  

భారత్ జోడో యాత్ర వీడియోలకు కేజీఎఫ్-2 సినిమా పాటలను జోడించారంటూ ఆడియో సంస్థ ఎమ్మార్టీ మ్యూజిక్... రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనతేలపై బెంగళూరులోని యశ్వంత్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్-2 పాటలపై సర్వ హక్కులు తమవేనని, తమ అనుమతి లేకుండా పాటలు వాడుకుంటున్నారని ఎమ్మార్టీ సంస్థ అధినేత నవీన్ కుమార్ ఆరోపించారు. జైరాం రమేశ్ ట్విట్టర్ లో రెండు వీడియోలను పోస్టు చేశారని తెలిపారు. అందులో కేజీఎఫ్-2 పాటలతో కూడిన వీడియోలు ఉన్నాయని వివరించారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ ఖాతాలను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

తాజాగా బెంగళూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. బెంగళూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టును కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు... కాంగ్రెస్ పార్టీ వాదనతో ఏకీభవించింది. కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ ఖాతాలను రద్దు చేయాలన్న బెంగళూరు కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
KGF-2
Bengaluru Court
Karnataka High Court
Twitter

More Telugu News