అసదుద్దీన్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలు బోగీపై రాళ్ల దాడి.. నిజం కాదంటున్న గుజరాత్ పోలీసులు

  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్
  • అహ్మదాబాద్ నుంచి సూరత్ కు వందేభారత్ రైల్లో ప్రయాణించిన నేత
  • మార్గమధ్యంలో అసద్ కూర్చున్న బోగీపై రాళ్ల దాడి
  • ఘటనలో రైలు బోగీ అద్దాలు పాక్షికంగా ధ్వంసమైన వైనం
stone pelting on vandebharat train which mim chief asaduddin travels in gujarat

మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలు బోగీపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో అసద్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలు బోగీ అద్దాలు పాక్షికంగా ధ్వంసమమ్యాయి. తమ నేతపై రాళ్ల దాడి జరిగిందన్న మజ్లిస్ నేతల ఆరోపణలపై గుజరాత్ పోలీసులు వివరణ ఇచ్చారు. అసదుద్దీన్ పై ఎలాంటి దాడి జరగలేదని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కూడా తన అభ్యర్థులను నిలుపుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లో పలు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ అక్కడికి వెళ్లారు. సోమవారం రాత్రి సూరత్ లో ప్రచారం నిర్వహించే నిమిత్తం ఆయన అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలు ఎక్కారు. 

ఈ క్రమంలో మార్గమధ్యంలో ఓ చోట గుర్తు తెలియని వ్యక్తులు అసదుద్దీన్ కూర్చున్న బోగీపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అసదుద్దీన్ కు ఏమీ కాకున్నా...ఆయన పక్కన ఉన్న బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ పోలీసులు... ఆ మార్గంలో కొంతమేర రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని, ఆ పనులకు వినియోగించే రాళ్లే రైలు బోగీపై పడి ఉంటాయని తెలిపారు.

More Telugu News