Pattabhi: మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే ద్వారంపూడిపై టీడీపీ నేత పట్టాభి ఫైర్

  • బియ్యం బకాసురులు అంటూ ధ్వజం
  • జగన్ రెడ్డి ఖజానా నింపుతున్నారని విమర్శలు
  • బియ్యం స్కాంపై సీబీఐ విచారణకు పట్టాభి డిమాండ్
TDP leader Pattabhi slams minister Karumuri Nageswararao and MLA Dwarampudi Chandrasekhar

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో బియ్యం మాఫియా రాజ్యమేలుతోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభకోణం రాష్ట్రంలో చోటుచేసుకుందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. 

జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన మొత్తం స్కాములతోనే నడిచిందని, ఇప్పుడు పేదోడి రేషన్ బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి కుంభకోణానికి తెరలేపారని వెల్లడించారు. 

"రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం కుంభకోణానికి ఇద్దరు రథసారథులున్నారు. ఒకరు ‘ఖతర్నాక్ కారుమూరి’ నాగేశ్వరరావు, రెండో వ్యక్తి.. ‘దోపిడీకి ద్వారం'.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ ఇద్దరు బియ్యం బకాసురులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి... కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్లు జగన్ రెడ్డి ఖజానాకు తరలిస్తున్నారు. 

రాష్ట్రంలో బియ్యం దిగుబడులు పెరగకపోయినా... కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతులు అమాంతం ఏ విధంగా పెరుగుతాయి? 2018-19లో బియ్యం దిగుబడులు 82.30 లక్షల టన్నులుంటే, 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులకు తగ్గాయి. 

బియ్యం ఎగుమతులు 2018-19లో 18.09 లక్షల టన్నులుంటే.. 2020-21 నాటికి 31.51 లక్షల టన్నులకు, 2021-22 నాటికి ఏకంగా 48.26 లక్షల టన్నులకు ఎలా చేరాయి?

పంట దిగుబడులు పెరగలేదని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ఎగుమతులు ఎలా పెరుగుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టించి విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కాదా?" అని పట్టాభిరామ్ నిలదీశారు.

More Telugu News