'పొన్నియిన్ సెల్వన్' హిట్ తో మరోసారి త్రిష దశ తిరిగినట్టే!

  • మరింత గ్లామరస్ గా తయారైన త్రిష 
  • 'పొన్నియిన్ సెల్వన్' తో దక్కిన హిట్ 
  • మళ్లీ పెరుగుతున్న అవకాశాలు 
  • స్టార్ హీరోల సినిమాల నుంచి భారీ ఆఫర్లు
Trisha Special

తెలుగులో త్రిష జోరు తగ్గి చాలా కాలమే అయింది. తమిళంలో మాత్రం నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా చేస్తూ వెళుతోంది. అడపాదడపా మలయాళ తెరపై మెరుస్తోంది. ఇక త్రిష కెరియర్ దాదాపు ముగిసినట్టేనని అందరూ అనుకుంటూ ఉండగా, ఆమెకి మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె 'కుందాదేవి' అనే కీలకమైన పాత్రను పోషించింది. 

భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాను తెలుగులో పెద్దగా పట్టించుకోకపోయినా, తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. కథాకథనాల సంగతి అలా ఉంచితే, గ్లామర్ పరంగా ప్రేక్షకులను త్రిష ఆకట్టుకుంది. గతంలో కంటే ఆమె ఇప్పుడు మరింత గ్లామరస్ గా తయారైందనే టాక్ బలంగా వినిపించింది. దాంతో మళ్లీ ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నట్టుగా సమాచారం. 

 తమిళంలో విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ఆ సినిమా కోసం త్రిషను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అలాగే అజిత్ - విఘ్నేశ్ శివన్ కలిసి చేయనున్న సినిమాలోను ఆమెనే ఎంపిక చేశారని అంటున్నారు. పారితోషికం పరంగా నయనతార అందుబాటులో లేకపోవడం కూడా త్రిషకి కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనేం మొత్తానికి మరోసారి త్రిష దశ తిరిగినట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. 

More Telugu News