Vande Bharat Train: నిర్ణీత సమయానికి 16 నిమిషాల ముందే చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్

  • దక్షిణాదిలో తొలి వందేభారత్ రైలు
  • చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ట్రయల్ రన్
  • 504 కిమీ ప్రయాణించిన రైలు
  • 6 గంటల 24 నిమిషాల్లో చెన్నై నుంచి మైసూరు చేరిక
Vande Bharat train arrives 16 minutes early in trial run Chennai and Mysore via Bengaluru

ఇటీవల దేశంలో వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను దశల వారీగా ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు చెన్నై-బెంగళూరు-మైసూరు మార్గంలో పరుగులు తీయనుంది. 

ఈ క్రమంలో ట్రయల్ రన్ నిర్వహించగా, వందేభారత్ రైలు నిర్ణీత సమయం కంటే 16 నిమిషాలు ముందే చేరుకుంది. ఈ ట్రయల్ రన్ సందర్భంగా రైలులో సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు, సదరన్ రైల్వే అధికారులు ప్రయాణించారు. 

వందేభారత్ రైలు చెన్నైలో ఉదయం 5.50 గంటలకు బయల్దేరగా, కేఎస్సార్ బెంగళూరు రైల్వే స్టేషన్ కు 10.21 గంటలకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం బెంగళూరుకు 10.25 గంటలకు చేరుకోవాలి. అటు, మైసూరుకు మధ్యాహ్నం 12.14 గంటలకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం మైసూరుకు 12.30 గంటలకు చేరుకోవాలి.

చెన్నై నుంచి బెంగళూరు మీదుగా మైసూరుకు 6 గంటల 24 నిమిషాల్లో చేరుకుంది. మొత్తం 504 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ వందేభారత్ రైలు మధ్యలో కాట్పాడి, కేఎస్సార్ బెంగళూరు స్టేషన్లలో ఆగింది. ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం బెంగళూరులో ప్రారంభించనున్నారు. 

కాగా, వందేభారత్ రైలు వేగం మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ కూడా ఇదే వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు రెండింటికి తేడా ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News