Demonetisation: డీమానిటైజేషన్ కు నేటితో ఆరేళ్లు... సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు

numerous posts in social media over demonetisation
  • 2016 నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన మోదీ
  • నేటికి ఈ నిర్ణయం జరిగి ఆరేళ్లు పూర్తయిన వైనం
  • దోపిడీని నోట్ల రద్దు వ్యవస్థీకృతం చేసిందన్న ఖర్గే
  • డిజిటల్ చెల్లింపుల కాలంలో కరెన్సీ చెలామణి పెరుగుదల ఎందుకన్న టీడీపీ
ఆరేళ్ల క్రితం సరిగ్గా... ఇదే రోజు (నవంబర్ 8) రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ టీవీ తెరలపై ప్రత్యక్షమయ్యారు. దేశంలో రూ1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా ఆయన మరో బాంబు లాంటి వార్తను పేల్చారు. అయితే అప్పటికే జనం వద్ద ఉన్న రూ1,000,రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు కొంత గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ గడువును ఆ తర్వాత మరికొన్నాళ్ల వరకు పొడిగించారు. రూ.1,000 నోటు స్థానంలో దానికంటే రెట్టింపు విలువ కలిగిన రూ.2 వేల నోటు చెలామణిలోకి వచ్చింది. ఇక రూ.500 నోటు స్థానంలో అదే విలువతో కొత్త నోటు ఎంట్రీ ఇచ్చేసింది.

దేశంలోనే అతి పెద్ద సంచలన నిర్ణయంగా జనం డీమానిటైజేషన్ ను ఇప్పటికీ గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు అంటూ నాడు జరిగిన నిర్ణయానికి నేటితో ఆరేళ్లు నిండిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వీటిలో చాలా వరకు పెద్ద నోట్ల రద్దును విమర్శిస్తూ సాగుతున్నవే ఉండటం గమనార్హం. డీమానిటైజేషన్ ను సమర్థిస్తున్న పోస్టులు దాదాపుగా కనిపించడం లేదనే చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీమానిటైజేషన్ పై మంగళవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దును ఆయన నేరంగా అభివర్ణించారు. దోపిడీని వ్యవస్థీకృతం చేసిన పెద్ద నోట్ల రద్దు... దేశంలో అవినీతిని న్యాయబద్ధం చేసిందంటూ ఆయన సెటైర్లు సంధించారు. డీమానిటైజేషన్ సందర్భంగా బ్యాంకుల వద్ద వెలసిన బారులలో నిలుచుని ప్రాణాలు కోల్పోయిన 150 మందికి ఆయన నివాళి అర్పించారు. దేశంలోని చిరు వ్యాపారుల జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిణామంగా ఆయన డీమానిటైజేషన్ ను అభివర్ణించారు. ఇంత పెద్ద తప్పు చేసిన ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.

పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత దేశంలో పెరిగిపోయిన డిజిటల్ చెల్లింపులను ప్రస్తావిస్తూ దేశంలో ఇప్పుడు చెలామణిలో ఉన్న నోట్ల విలువను జోడిస్తూ టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ జరిగే నాటికి దేశంలో 17.74 లక్షల కోట్ల విలువ కలిగిన కరెన్సీ చెలామణిలో ఉందన్న ఆయన... ప్రస్తుతం 31.81 లక్షల కోట్ల విలువ కలిగిన కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయన్నారు. ఈ లెక్కన దేశంలో ఈ ఆరేళ్లలోనే 14.07 లక్షల కోట్ల విలువ కలిగిన కరెన్సీ పెరిగిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ఇంతమేర కరెన్సీ చెలామణిలో ఉంటే... అసలు జరుగుతున్న తంతు ఏమిటో గుర్తించారా? అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Demonetisation
Prime Minister
Narendra Modi
Congress
BJP
Mallikarjun Kharge
TDP
GV Reddy

More Telugu News