టాలీవుడ్ తెరపైకి మరో కన్నడ బ్యూటీ!

  • కల్యాణ్ రామ్ నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం
  • మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న కల్యాణ్ రామ్ 
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
  • వచ్చే ఏడాదిలో ఫిబ్రవరి 10వ తేదీన విడుదల
Amigos movie update

తెలుగు తెరకి ఒకప్పుడు బాలీవుడ్ నుంచి .. మలయాళం నుంచి ఎక్కువ మంది హీరోయిన్స్ పరిచయమవుతూ ఉండేవారు. ఆ తరువాత కాలంలో బాలీవుడ్ నుంచి జోరు తగ్గింది. మలయాళ భాష నుంచి మాత్రం కొత్త భామల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక ఈ మధ్య కాలంలోనే కన్నడ నుంచి కూడా టాలీవుడ్ వైపు వచ్చే బ్యూటీల జోరు పెరుగుతూనే ఉంది. అలా ఇప్పుడు కన్నడ నుంచి కాలు పెడుతున్న మరో అందాల భామనే 'ఆషిక రంగనాథ్'. కల్యాణ్ రామ్ తాజా చిత్రం ద్వారా ఈ సుందరి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'అమిగోస్' అనే టైటిల్ ను ఖరారు చేసి, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ఆషిక రంగనాథ్ ను తీసుకున్నారు. 2016లో కన్నడ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలెట్టిన ఆషిక, ఇంతవరకూ పది సినిమాల వరకూ చేసింది. కల్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఫస్టులుక్ పోస్టర్ లోను ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. ఆషిక కూడా గ్లామరస్ హీరోయిన్ కావడం వలన ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

More Telugu News