smartphone: స్మార్ట్ ఫోన్ తో గుండెకూ ప్రమాదమే!

Cardiologists warn of possibility of health hazards from excessive smartphone use
  • కార్డియాలజిస్టుల హెచ్చరిక
  • స్మార్ట్ ఫోన్లతో మెడ, వెన్ను సంబంధిత సమస్యలు
  • కంటి చూపునకూ నష్టమే
స్మార్ట్ ఫోన్లతో కళ్లకు నష్టం కలుగుతుందని వైద్యులు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కానీ, ఈ నష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు. పరిశీలించి చూస్తే స్మార్ట్ ఫోన్లతో తెలియకుండానే మన ఆరోగ్యానికి నష్టం జరుగుతోంది. కొత్త సమస్యలు పలకరిస్తున్నాయి. 

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మెడ నొప్పి, వెన్ను నొప్పి సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. స్మార్ట్ ఫోన్ ను చేత్తో పట్టుకుని చూసినంత సేపు మెడను అలా బెండ్ చేసి ఉంచడం వల్ల వెన్నుపాముపై ప్రభావం పడుతోంది. ఫలితంగా దీర్ఘకాలిక మెడ, వెన్ను నొప్పుల సమస్యల బాధితులు పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే కిరణాలు మన కంటిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆసక్తిగా చూసే క్రమంలో కన్నార్పడం మర్చిపోతున్నారు. ఇది సైతం కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది.

తాజాగా స్మార్ట్ ఫోన్లతో గుండె ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరించారు. కేరళ కార్డియాలజిస్టుల సొసైటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై వైద్యులు మాట్లాడారు. అధిక ఒత్తిళ్లు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతున్నట్టు కేరళ కార్డియాలజీ సొసైటీ ప్రెసిడెంట్ ప్రభానాని గుప్తా పేర్కొన్నారు.

‘‘అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, కదలికలు పెద్దగా లేని జీవనం, స్థూల కాయం, పొగ తాగడం, అధికంగా ఆల్కహాల్ సేవించడం, వ్యాయామం లోపించడం, నిద్రలేమి ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసే అంశాలు. ఇప్పుడు అధికంగా స్మార్ట్ ఫోన్ ను వినియోగించడం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో గుండె జబ్బుల రిస్క్ పెరగడం కొత్త రిస్క్’’ అని డాక్టర్ ప్రభానాని తెలిపారు. కనుక స్మార్ట్ ఫోన్ ను పరిమిత సమయం పాటు చూడడమే సమస్యకు పరిష్కారమని వైద్యుల సూచన.
smartphone
excessive use
hazards
heart
Cardiologists

More Telugu News