Hyderabad: నాగోలు ఫ్లై ఓవర్‌పై బీభత్సం సృష్టించిన ట్యాంకర్ .. కార్లు, బైకుల ధ్వంసం

6 injured in a road accident held on nagole flyover
  • శంషాబాద్ నుంచి నాచారం వెళ్తున్న ట్యాంకర్
  • ఫ్లై ఓవర్‌పైకి రాగానే బ్రేకులు ఫెయిల్
  • ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
హైదరాబాద్‌లోని నాగోలు ఫ్లై ఓవర్‌పై ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండు కార్లు, రెండు బైకులు ధ్వంసం కాగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ సాయినగర్‌కు చెందిన శ్రీను (25) లారీ డ్రైవర్. నాచారంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న అతను ట్యాంకర్ ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆయిల్ తరలిస్తుంటాడు. రోజువారీలానే సోమవారం ఉదయం కూడా ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా నాగోలు ఫ్లైఓవర్ వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అదుపు తప్పిన లారీ ముందు వెళ్తున్న రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది.

ఈ ఘటనలో కార్లు ధ్వంసం కాగా, అందులో ఉన్న జాలా వెంకమ్మ (65), ఆమె కోడలు విజయ (35)  గాయపడ్డారు. కాగా, వెంకమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం కిమ్స్ ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. అలాగే, బైకర్లు మర్రికంటి రమేశ్, చెన్నకేశవులు గాయపడ్డారు. మరో బైక్‌పై వెళ్తున్న కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీ జనప్రియ క్వార్టర్స్‌కు చెందిన కె.రాజశేఖర్, రమాదేవి దంపతులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Nagole
Nagole Flyover
Road Accident

More Telugu News