Shoaib Malik: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ బంధానికి బీటలు!

Sania Mirza Shares Cryptic Post Amid Divorce Rumours With Shoaib Malik
  • గత కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు వార్తలు
  • బద్దలైన హృదయాలు అల్లాను వెతుక్కుంటూ వెళ్తాయని సానియా పోస్ట్
  • సానియా టెన్నిస్ అకాడమీల గురించి తనకు తెలియదన్న షోయబ్
  • పాకిస్థాన్ మోడల్‌తో షోయబ్‌కు ఎఫైర్ ఉందని వార్తలు
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోతున్నారా? తాజాగా వారు చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ‘బద్దలైన హృదయాలు అల్లాను వెతుక్కుంటూ వెళ్తాయి’ అని సానియా మీర్జా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. 

అలాగే, ఓ టీవీ షోలో ఓ అభిమాని వేసిన ప్రశ్నకు షోయబ్ ఇచ్చిన సమాధానం కూడా ఇందుకు ఊతమిస్తోంది. సానిమా మీర్జా నిర్వహించే టెన్నిస్ అకాడమీల గురించి చెప్పాలని అడగ్గా.. ఆమెకు ఎక్కడెక్కడ అకాడమీలు ఉన్నాయో తనకు తెలియదని షోయబ్ సమాధానమిచ్చాడు. ఆ సమాధానం విని మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా ఆశ్చర్యపోయాడు. వారిద్దరూ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి విడిపోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు, వారిద్దరూ వేర్వేరుగా కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది. 

సానియా మీర్జా-షోయబ్ మాలిక్ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఓ బాబు జన్మించాడు. వివాహం తర్వాత వీరిద్దరూ దుబాయ్‌లో ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన పామ్ జుమేరా ఐలాండ్‌లో విలాసవంతమైన విల్లాలో ఉండేవారు. అయితే, కుమారుడి చదువు కోసం దుబాయ్‌లోనే వారు మరో ప్రాంతానికి మారినట్టు తెలుస్తోంది. 

కాగా, వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఎందుకు వచ్చాయన్న విషయంలో స్పష్టత లేకున్నప్పటికీ, పాకిస్థాన్‌కు చెందిన ఓ మోడల్‌తో షోయబ్ ఫొటో షూట్ చేశాడని, ఆమెతో షోయబ్‌కు ఎఫైర్ ఉందని కూడా పుకార్లు షికారు చేశాయి. షోయబ్-సానియా బంధం బీటలు వారడానికి ఇదే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు వీరిద్దరూ బహిరంగంగా స్పందించలేదు.
Shoaib Malik
Sania Mirza
Marriage
Sania Mirza Divorce

More Telugu News