Gorantla Butchaiah Chowdary: పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామనే జగన్ మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • గోరంట్ల బుచ్చయ్య ప్రెస్ మీట్
  • వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు
  • నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడంలేదని వ్యాఖ్యలు
  • నూతన విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Gorantla Butchaiah Chowdary slams CM Jagan over paddy procurement

పేదవాడి బియ్యాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం వదలడంలేదని, ఇలాంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం మనకుండడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం కొనుగోళ్లలో నూతన నిబంధనలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. గతేడాది రైతులు విక్రయించిన ధాన్యం బకాయిలు అందక ఇప్పటికీ అగచాట్లు పడుతున్నారని, నూతన నిబంధనలను ఉపసంహరించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 

"ఈ ఏడాది రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామనే జగన్ రెడ్డి మాటలు.. కాగితాలకే పరిమితం అయ్యాయి. చంద్రన్న పాలనలో వారంలోనే ధాన్యం బకాయిలు చెల్లించగా.. నేడు నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు. 

జగన్ రెడ్డి నూతన నిబంధనలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పీఏసీఎస్‌లకు ఆర్‌బీకేలను ఎండార్స్‌ చేయగా.. ఆయా పీఏసీఎస్‌ సిబ్బంది, సీఈవోలు ధాన్యం కొనుగోలును పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సరికొత్త నిబంధనలు అమలులోకి తేవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) సహకరించడం లేదు. అనేక మంది పీఏసీఎస్‌ల సీఈవోలు ధాన్యం కొనుగోలు విషయమై వెనకడుగు వేస్తున్నారు. 

పీఏసీఎస్‌ సిబ్బంది రైస్‌ మిల్లర్ల వద్దకు వెళ్లి గోనె సంచులను తీసుకురావాల్సి ఉంది. వాటిని తమ పరిధిలోని రైతుభరోసా కేంద్రాలకు అప్పగించాలి. ధాన్యం రవాణాకు సంబంధించి ప్రతి పీఏసీఎస్‌ ఐదు వాహనాలకు తక్కువ కాకుండా ఆర్‌బీకేలకు ఎటాచ్‌ చేయాల్సి ఉంది. గతంలో ఖాళీ గోనె సంచులను రైస్‌మిల్లర్లే రైతులకు అందించేవారు.   కొత్తగా ఆ బాధ్యతలను పీఏసీఎస్‌లకు అప్పగించడం తుగ్గక్ నిర్ణయమే. 


ధాన్యం తరలించే వాహనాలను కూడా ఆర్‌బీకేలకు అప్పగించడం వల్ల అనేక సమస్యలు ఎదురు కానున్నాయి. గతేడాది సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో మిల్లర్లకు ధాన్యం ఇచ్చి ట్రక్కు సీట్లు కటింగ్‌ చేయించలేకపోయారు. దీంతో రైతులకు నేటికీ సొమ్ము అందలేదు. ఇప్పటికీ మిల్లర్ల చుట్టూ తిరుగుతున్నారు.

గతేడాది ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిస్థాయిలో పీఏసీఎస్‌లకు కమీషన్లు చెల్లించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు నుంచి పీఏసీఎస్‌లను తప్పించాలి. పాత నిబంధనలే అనుసరించాలి. ధాన్యం సేకరణ లక్ష్యాలను జగన్ రెడ్డి ఈ ఏడాది కుదించడం రైతు ద్రోహమే. ఈ ఏడాది నవంబర్ వచ్చినా ఈ-క్రాప్, ఈకేవైసీ పూర్తికాలేదు. 

మరోవైపు గన్నీబ్యాగుల కొరత వేధిస్తోంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది ధాన్యం అధికంగా సేకరించాల్సి ఉన్నప్పటికీ జగన్ రెడ్డి చేతులెత్తేశారు. 2019-20 ఖరీఫ్ లో 47,83,347 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 37 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యంగా నిర్దేశించడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం.  గన్నీ బ్యాగులు 9.25 కోట్లు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 55 లక్షల గోనె సంచులే ఉన్నాయి. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేలా పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టాలి" అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

More Telugu News