Virat Kohli: కష్టకాలంలో ధోనీ పంపిన సందేశాన్ని గుర్తుచేసుకున్న కోహ్లీ

  • 2019 తర్వాత ఫామ్ కోల్పోయిన కోహ్లీ
  • తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వైనం
  • కెప్టెన్సీ కూడా కోల్పోయిన కోహ్లీ
  • ధోనీ ఒక్కడే నిజాయతీగా స్పందించాడని వ్యాఖ్య  
Kohli recalls Dhoni message

ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్ మన్లలో ఒకడైన విరాట్ కోహ్లీ 2019 తర్వాత అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొనడం తెలిసిందే. ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ పరుగులు సాధించలేక సతమతమయ్యాడు. ఒకప్పుడు పొగిడినవారే, ఆ తర్వాత కాలంలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ దశలో జట్టులో కోహ్లీని కొనసాగించడంపైనా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి కోహ్లీ కెప్టెన్సీ కూడా కోల్పోయేంతగా పరిస్థితులు దిగజారాయి. ఇటీవల కోహ్లీ ఫామ్ లోకి రావడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. 

అయితే తాను కష్టకాలంలో ఉన్నప్పుడు క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ పంపిన సందేశాన్ని కోహ్లీ తాజాగా వెల్లడించాడు. తాను కెరీర్ పరంగా సమస్యల వలయంలో చిక్కుకుని బాధపడుతున్నప్పుడు ఎంతో నిజాయతీగా స్పందించిన వ్యక్తి ధోనీ ఒక్కడేనని తెలిపాడు. 

తాను ఫామ్ లో లేని సమయంలో ధోనీ నుంచి వచ్చిన మెసేజ్ ఎంతో విలువైనదని వివరించాడు. ధోనీ వంటి సీనియర్ ఆటగాడితో పరస్పర గౌరవంతో కూడిన స్నేహానుబంధం కలిగివుండడం ఓ దీవెనగా భావిస్తానని పేర్కొన్నాడు. 

"ధోనీ పంపిన సందేశంలో ఓ అంశం నన్ను బలంగా తాకింది. నువ్వు ఆత్మవిశ్వాసంతో నిలబడినప్పుడు, దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు... నువ్వు ఎలా ఆడుతున్నావు అన్న విషయాన్ని అడగడం ప్రజలు మర్చిపోతారు అని ధోనీ పేర్కొన్నాడు. నా పరిస్థితికి ఇది సరిగ్గా సరిపోతుందనిపించింది. ప్రజలు నన్నెప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం కూడిన వ్యక్తిగా, మానసికంగా బలమైన వ్యక్తిలా, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగిన వ్యక్తిలా చూసేవారు. అయితే, జీవితంలోని కొన్ని సమయాల్లో రెండడుగులు వెనక్కి వేసి మనల్ని మనం సమీక్షించుకోవాలన్న విషయం అర్థం చేసుకున్నాను" అని వివరించాడు.

More Telugu News