Pancreatic cancer: బరువు తగ్గిపోయి, షుగర్ పెరిగిపోతుంటే.. పాంక్రియాటిక్ కేన్సర్ కావచ్చు!

Pancreatic cancer could be diagnosed up to three years earlier new study
  • యూనివర్సిటీ ఆఫ్ సర్రీ పరిశోధకుల అధ్యయనం
  • కేన్సర్ నిర్ధారణ కావడానికి ముందే సంకేతాలు
  • రెండు మూడేళ్ల ముందు బరువు తగ్గిపోవచ్చని వెల్లడి
మన శరీరంలో క్లోమ గ్రంధి ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంటుంది. దీన్నే పాంక్రియాస్ అంటారు. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు కావాల్సిన ఎంజైమ్ లను పాంక్రియాస్ విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్ లు చక్కెరలు, ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తాయి. మనం తిన్నది అరగాలంటే ఈ జీర్ణ రసాలు ఎంతో అవసరం. అలాగే, మన మన రక్తంలో చక్కెరలను నియంత్రించే ఎండోక్రైన్ హార్మోన్ల విడుదల కూడా పాంక్రియాస్ చేస్తుంటుంది. 

మధుమేహం రావడానికి పాంక్రియాస్ దెబ్బతినడం కూడా ఒక కారణమే. అంతేకాదు, ఇప్పుడు పాంక్రియాటిక్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. కాస్తంత అవగాహనతో ఉంటే, పాంక్రియాటిక్ కేన్సర్ ను చాలా ముందుగానే (ప్రాణాంతక దశలోకి వెళ్లడానికి ముందు) గుర్తించి చికిత్స తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

పాంక్రియాటిక్ కేన్సర్ అన్నది సైలెంట్ కిల్లర్ వంటిదే. ఇది ముదిరిన తర్వాత కానీ, చాలా మందిలో లక్షణాలు బయటకు కనిపించవు. కాకపోతే, బరువు తగ్గిపోయి, అదే సమయంలో బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతే మాత్రం పాంక్రియాటిక్ కేన్సర్ గా అనుమానించాల్సిందేనని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ సర్రీకి చెందిన పరిశోధకులు, ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పరిశోధకుల సాయంతో దీన్ని నిర్వహించారు. ఈ ఫలితాలు ప్లస్ వన్ లో ప్రచురితమయ్యాయి. 

పాంక్రియాటిక్ కేన్సర్ నిర్ధారణ అవ్వడానికి కొన్నేళ్ల ముందే బాధితుల్లో బరువు తగ్గి, రక్తంలో చక్కెరలు పెరిగి మధుమేహం బారిన పడతారన్నది వీరు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. సాధారణంగా బరువు తగ్గినా, బ్లడ్ షుగర్ పెరిగినా వైద్యులు ఔషధాలు, జీవనశైలి, ఆహారాల్లో మార్పులు సూచిస్తుంటారు. కానీ, వాటి వెనుక ఇతర కారణాలున్నాయా? అన్నది అనుమానించరు. తాజా అధ్యయనం ఫలితాలను చూసిన తర్వాత అయినా, వ్యాధి నిర్ధారణలో పురోగతి ఉంటుందని ఆశించొచ్చు.

పాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడిన 9,000 మంది ప్రజల బాడీమాస్ ఇండెక్స్, హెచ్ బీఏ 1సీ ఫలితాలను పరిశోధకులు.. ఈ వ్యాధి బారిన పడని 35,000 మంది ప్రజల బాడీమాస్ ఇండెక్స్, హెచ్ బీఏ 1సీ ఫలితాలతో పోల్చి చూశారు. కేన్సర్ బారిన పడిన వారిలో వ్యాధి నిర్ధారణకు రెండు మూడేళ్ల ముందే బరువు తగ్గిపోయినట్టు తెలుసుకున్నారు. కేన్సర్ లేని వారితో పోలిస్తే.. ఉన్న వారి బాడీమాస్ ఇండెక్స్ మూడు పాయింట్లు తక్కువగా ఉంది.

మధుమేహం లేని వారితో పోలిస్తే, మధుమేహంతోపాటు బరువు తగ్గిపోయిన వారిలో పాంక్రియాటిక్ కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని వీరు చెబుతున్నారు. అలాగే, మధుమేహం ఉన్న వారితో పోలిస్తే, మధుమేహం లేకుండా బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతున్న వారిలోనూ కేన్సర్ రిస్క్ ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Pancreatic cancer
diagnosed
three years earlier
weight loss
blood glucose
new study

More Telugu News