daughter: బిడ్డ మృతదేహంతో బైక్ పై ఇంటికి.. ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన

  • 50 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లిదండ్రులు
  • ఉచిత అంబులెన్స్ లేదన్న ఆసుపత్రి సిబ్బంది
  • భారీ మొత్తం డిమాండ్ చేసిన ప్రైవేటు వాహనదారులు
  • గత్యంతరం లేక బైక్ పైనే తీసుకెళ్లిన తండ్రి 
A couple carry daughter dead body on bike in khammam

బిడ్డ చనిపోయిన బాధను గుండెల్లో దిగమింగి, బైక్ పై మృతదేహంతో ఇంటికి బయల్దేరాడా తండ్రి.. ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేదని ఆసుపత్రి సిబ్బంది తేల్చిచెప్పడంతో గత్యంతరంలేక మృతదేహాన్ని తన బండిపైనే తరలించాడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ అమానవీయ సంఘటన.. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక వెట్టి సుక్కి ఇటీవల అనారోగ్యానికి గురైంది. సుక్కిని ఆమె తండ్రి ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ ఆదివారం సుక్కి చనిపోయింది. దీంతో మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ కోసం అడగగా.. ఆసుపత్రి సిబ్బంది లేదని చెప్పారు. ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేటు వాహనదారుల దగ్గర విచారిస్తే.. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగారు. దీంతో ఆ తండ్రికి ఏంచేయాలో పాలుపోలేదు.

బిడ్డ మృతదేహం, భార్య, తండ్రిలను బైక్ పై కూర్చోబెట్టుకుని ఇంటికి బయల్దేరాడా పాప తండ్రి.. ఖమ్మం నుంచి కొత్తమేడేపల్లి దాదాపు 50 కిలోమటర్ల దూరంలో ఉంటుంది. ఇంతదూరం కూడా పాప మృతదేహంతో పాటు పాప తల్లిదండ్రులు, తాత కలిపి నలుగురు ప్రయాణించారు. దీనిని కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.

More Telugu News