Tirumala: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన వేళల్లో కీలక మార్పులు

  • వచ్చే నెల నుంచి ఉదయం 8–12 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు
  • ఈ మేరకు టికెట్లు అందుబాటులో ఉంచుతామన్న ఈవో ధర్మారెడ్డి
  • అక్టోబరులో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 122.23 కోట్లు
changes in tirumla vip break darshan timings

తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో కీలక మార్పులు జరగనున్నాయి. డిసెంబర్ నెల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల వేళలను మారుస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ టికెట్ల ఆన్‌ లైన్ స్లాట్లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆపన్న హస్తం పథకానికి రూ. లక్ష డిపాజిట్ ఇచ్చే వారికి ఆరు బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. రూ. 10 వేలు ఇచ్చే వారికి కూడా ఈ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారని చెప్పారు. కానీ, ఇది సాధ్యం కాదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ నెలలో శ్రీవారిని 22.72 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆయన వెల్లడించారు. హుండీ కానుకలు రూ. 122.23 కోట్లు వచ్చాయని తెలిపారు. 1.08 కోట్ల లడ్డూలను విక్రయించామన్నారు. 10.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.

More Telugu News